వివాదంలో ప్రముఖ నటి నమిత భర్త!
ప్రస్తుతం చెన్నైలో నివాసముంటున్న నమిత బీజేపీ పార్టీలో ఉన్నారు. కాగా నమిత భర్త చౌదరి తాజాగా ఒక వివాదంలో కూరుకున్నారు.
ప్రముఖ నటి, బొద్దుగుమ్మ నమిత తెలియనివారెవరూ లేరు. తెలుగులో ఆర్యన్ రాజేశ్ సరసన సొంతం, విక్టరీ వెంకటేశ్ సరసన జెమిని, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన బిల్లా తదితర సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం చిత్రాల్లో నటించిన నమిత వ్యాపారవేత్త అయిన చౌదరిని వివాహమాడిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చెన్నైలో నివాసముంటున్న నమిత బీజేపీ పార్టీలో ఉన్నారు. కాగా నమిత భర్త చౌదరి తాజాగా ఒక వివాదంలో కూరుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ ఛైర్మన్ పదవికి సంబంధించి జరిగిన మోసం కేసులో సినీ నటి నమిత భర్త చౌదరి సహా ఇద్దరికి సేలం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది. వీరిద్దరినీ విచారణకు హాజరు కావాల్సిందిగా కోరింది.
పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ అధ్యక్షుడి పదవి ఇప్పిస్తామంటూ సేలం నగరానికి చెందిన ముత్తురామన్ అనే వ్యక్తి సేలం జిల్లాలోని అమ్మాపాళయం జాకిర్ ప్రాంతానికి చెందిన గోపాల్ స్వామి వద్ద రూ.50 లక్షల నగదు తీసుకుని మోసం చేశాడు. అయితే ఆ పదవికి నమిత భర్త చౌదరి ఇటీవల ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో తాను మోసపోయినట్టు గ్రహించిన గోపాల్ స్వామి పోలీసులను ఆశ్రయించాడు.
ఈ కేసుకు సంబంధించి ముత్తురామన్ తో పాటు కౌన్సిల్ జాతీయ కార్యదర్శి దుశ్యంత్ యాదవ్ ను అక్టోబర్ 31న అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ తమిళనాడు విభాగ అధ్యక్షుడు చౌదరితో పాటు ముత్తురామన్ సహాయకుడు, బీజేపీ రాష్ట్ర మీడియా విభాగ ఉపాధ్యక్షుడు మంజునాథ్ కూడా విచారణకు హాజరవ్వాలంటూ పోలీసులు సమన్లు పంపారు.
అయితే నమిత భర్త చౌదరి, మంజునాథ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఈ పరిస్థితుల్లో విచారణను పోలీసులు సేలం సెంట్రల్ క్రై మ్ బ్రాంచికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో నమిత భర్త చౌదరి, ముత్తురామన్ సహాయకుడు మంజునాథ్ లను విచారణకు హాజరు కావాలని సేలం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది.