108 - ఇది అంబులెన్స్ నెంబర్ కాదు... ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు!
అవును... మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి రోజు రోజుకి అత్యంత అధ్వాన్నంగా మారిపోతోంది.
సాధారణంగా 108 అంటే కుయ్ కుయ్ మంటూ దూసుకువచ్చే అంబులెన్స్ నెంబర్ అని అంతా భావిస్తారు. అయితే ఇప్పుడు చెప్పుకుంటున్న 108 అనేది అంబులెన్స్ నెంబర్ కాదు.. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోని మరణాల సంఖ్య! కేవలం 8 రోజుల్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సంభవించిన మరణాల సంఖ్య ఇది! ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మాట్లాడింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా ఇది అత్యంత చర్చనీయాంశమైన అంశంగా ఉంది.
అవును... మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి రోజు రోజుకి అత్యంత అధ్వాన్నంగా మారిపోతోంది. వారం పదిరోజుల క్రితం ప్రారంభమైన మృత్యుఘోష ఆగడం లేదు. ఇందులో భాగంగా... గడచిన 48 గంటల్లో మరో 31 మరణాలు నమోదయ్యాయి. ఇదే క్రమంలో గత 24 గంటల్లోనే ఓ పసికందుతో సహా 11 మంది మరణించారు. దీంతో గడిచిన 8 రోజుల్లో అక్కడ మొత్తం మృత్యువాత పడిన రోగుల సంఖ్య 108 కి చేరింది.
దీనిపై నాందేడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా.. అక్కడ మందుల కొరతలేదని చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో... గత 24 గంటల్లో 1,100ల మందికి పైగా రోగులకు చికిత్స అందించామని, కొత్తగా మరో 191 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చుకున్నామని తెలిపారు. అక్కడితో ఆగని ఆ ఆస్పత్రి వైద్యులు... మొన్నటివరకూ 24 గంటల్లో సగటు మరణాల రేటు 13గా ఉండేదని, ఇప్పుడు 11కి తగ్గిందని తమ చర్యను సమర్ధించుకోవడం గమనార్హం.
ఈ విషయంపై రాజకీయంగా కూడా పెనుదుమారం రేగింది. ఇందులో భాగంగా... కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నాందేడ్ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 60 మందికి పైగా శిశువులు చేరగా.. వారిని చూసుకోవడానికి కేవలం ముగ్గురు నర్సులు మాత్రమే ఉన్నారని ఇది పూర్తిగా ప్రభుత్వం చేతకానితనమని, ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యానికి సాక్ష్యం అని అన్నారు!
ఇదే సమయంలో ఒకేసారి ముగ్గురు శిశువులకు చికిత్స చేయడానికి ఒక వార్మర్ ని ఉపయోగిస్తున్నారంటూ ఆసుపత్రిలోని స్టాఫ్ తీరును ప్రశ్నించారు. ఆసుపత్రి సామర్ధ్యం కంటే ఎక్కువ మంది రోగులు ఉన్నారని.. 500 పడక గదులు ఉన్న ఆసుపత్రిలో 1000 మందికిపైగా రోగుల్ని ఎలా అడ్మిట్ చేసుకున్నారని ప్రశ్నించారు.
ఇదే సమయంలో ఆ ఆస్పత్రిలో మందుల కొరత, సిబ్బంది కొరత లేదని డీన్ & కో లు చెబుతున్నారని... అయితే అదంతా అవాస్తవమని ఆయన అన్నారు. ఇక్కడ ముందుల కొరత, సిబ్బంది కొరత పుష్కలంగా ఉందనడం వాస్తవమని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రోగులు పిట్టల్లా రాలిపోతున్నారని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందంటూ అశోక్ చవాన్ మండిపడ్డారు!