కాక రేపుతున్న బెజవాడ రాజకీయం.. వైసీపీ నేత శిరోముండనం!
ఈ సందర్భంగా ప్రకాశ్‌నగర్‌లోని తన ఇంటి ముందే కూర్చుని శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు కూడా పక్కనే ఉన్నారు.
బెజవాడ రాజకీయం అంటేనే హాట్ హాట్‌గా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మరింత కాక రేపుతోంది. టీడీపీకూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీ అదినేత, సీఎం చంద్రబాబు హెచ్చరికలను సైతం కొందరు నాయకులు పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా విజయవాడ సహా పలు ప్రాంతాల్లో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడలో అయితే.. మరింత గా కాక రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి వద్ద గత వారం రోజులుగా ఉద్రిక్తంగానే ఉంది. దీంతో పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ బెంజిసర్కిల్ సమీపంలోని వంశీ ఇంటి వైపు వాహనాలను అనుమతించడం లేదు.
ఇదిలావుంటే.. విజయవాడ శివారు.. సింగ్‌నగర్ ఏరియాలో ఒకప్పటి టీడీపీ కార్పొరేటర్.. ప్రస్తుతవైసీపీ నాయకుడు నందేపు జగదీష్‌కు సంబంధించిన ఇంటిని ఆదివారం.. మునిసిపల్ అధికారులుకూల్చేశారు. బుల్ డోజర్లు ప్రయోగించి.. పోలీసులను రంగంలోకి దింపి వ్యాపార సముదాయాన్ని నేలమట్టం చేశారు. దీంతో ఇక్కడి రాజకీయ వాతావరణం కాక రేపుతోంది. తన వ్యాపార సముదాయాన్నికూల్చేయడం వెనుక టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఉన్నాడని ఆరోపిస్తూ.. జగదీష్ తన కుటుంబంతో సహా నిరసన వ్యక్తం చేశారు. కుట్ర, కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా ప్రకాశ్‌నగర్‌లోని తన ఇంటి ముందే కూర్చుని శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు కూడా పక్కనే ఉన్నారు. జగదీష్‌తో పాటు తన భార్యకు కూడా శిరోముండనం చేయించేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే.. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి నిరసనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జగదీష్‌కు.. పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం.. జగదీష్ మాట్లాడుతూ.. బోండా ఉమా దాదాగిరి ఎక్కువైందని మండిపడ్డారు. తన భవనాన్ని జేసీబీల సాయంతో పగలకొట్టించారని అన్నారు. గతంలో తాను టీడీపీలో ఉన్నప్పుడు ఈ భవనం ప్రారంభోత్సవం అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమానే చేశారని గుర్తు చేశారు.
అలాంటి భవనం ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉందా? అని జగదీష్ నిలదీశారు. అధికారం ఈరోజు టీడీపీది కావొచ్చు.. రేపు వైసీపీది కావొచ్చు.. కానీ, ఇలా కక్ష పూరిత రాజకీయాలు సింగ్‌నగర్ సహా విజయవాడలో దశాబ్దకాలంలో లేవన్నారు. కానీ, ఇప్పుడు ఉమా ఇలాంటి రాజకీయాలకు తెరదీశారని జగదీష్ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. ఈ విషయం తెలియగానే.. విజయవాడ పోలీసు కమిషనర్ సింగ్ నగర్‌లో భద్రత పెంచారు. జగదీష్‌ను ప్రశ్నించారు. ఏదైనా చట్టపరంగా ముందుకు రావాలని.. ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరించవద్దని తేల్చి చెప్పారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.