బాధ్యతలు వద్దు.. హోదా కావాలా? జగన్ పై లోకేశ్ ఫైర్

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష బాధ్యత నెరవేర్చుకుండా ప్రతిపక్ష నేత హోదా కావాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు.;

Update: 2025-03-05 08:16 GMT

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష బాధ్యత నెరవేర్చుకుండా ప్రతిపక్ష నేత హోదా కావాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పీకర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఆ సందర్భంగా జగన్ కోరుతున్న ప్రతిపక్ష హోదాపై దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత మాట్లాడిన మంత్రి నారా లోకేశ్ సైతం వైసీపీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అసెంబ్లీకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా కోరుతుండటంపై ప్రభుత్వం సీరియస్ అవుతోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు మంత్రులు లోకేశ్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఈ రోజు అసెంబ్లీలో వైసీపీని టార్గెట్ చేశారు. ప్రతిపక్ష బాధ్యత నెరవేర్చుకుండా మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. సభలో గవర్నరును అవమానించడం అత్యంత దారుణమని అభివర్ణించారు. పార్లమెంటు సంప్రదాయలను అనుసరించి జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్న విషయం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి తెలుసన్నారు.

సెక్షన్ 121 సి ప్రకారం ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో పదో వంతు ప్రతిపక్షానికి ఉండాలని లోక్ సభలో రూలింగ్ ఉందని లోకేశ్ గుర్తు చేశారు. గతంలో టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదంటూ గతంలో సీఎంగా పనిచేసిన జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేశ్ సభలో గుర్తు చేశారు. ఇప్పుడు స్పీకర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సభ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజా తీర్పును గౌరవించి వారి కోసం పోరాడాల్సిన బాధ్యత పార్టీలదేనని మంత్రి లోకేశ్ చెప్పారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంటే ఎక్కువ భద్రత జగన్ కు కల్పిస్తున్నామన్నారు. ఉపముఖ్యమంత్రికి జడ్ కేటగిరి భద్రత ఉంటే మాజీ సీఎం జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు వివరించారు. మరోవైపు జగన్ తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ప్రజలు ఛీ కొడితే హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రచార మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారంపై సభా హక్కుల సంఘానికి నివేదించాలని జనసేన తరుఫున కోరుతున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News