బాబు బృందానికి బై బై... టీం లోకేశ్ కే జై

టీడీపీ పొలిట్ బ్యూరోలో మొత్తం 22 మంది సభ్యులు ఉన్నారు. పార్టీపరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పొలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాతే ఓ అభిప్రాయానికి వస్తారు.

Update: 2025-01-17 07:15 GMT

టీడీపీలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చోటుచేసుకోన్నాయి. పార్టీలో అత్యున్నతమైన పొలిట్ బ్యూరోను సంస్కరించాలని యువనేత నారా లోకేశ్ భావిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. దీంతో పొలిట్ బ్యూరోలోకి లోకేశ్ తోపాటు ఆయన టీం ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీడీపీ పొలిట్ బ్యూరోలో మొత్తం 22 మంది సభ్యులు ఉన్నారు. పార్టీపరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పొలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాతే ఓ అభిప్రాయానికి వస్తారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇదే పద్ధతి కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అయినప్పటికీ పార్టీలో మిగతా సహచరులతో చర్చించి వారి అభిప్రాయం తెలుసుకోవడం టీడీపీ సంప్రదాయం. పార్టీలో అత్యున్నత నిర్ణాయక శక్తిగా పొలిట్ బ్యూరోను భావిస్తారు. ఈ పదవుల్లో ఉన్నవారికి పార్టీలో ఎంతో పలుకుబడి ఉంటుంది. ఇక పార్టీ అధికారంలో ఉండే సమయంలో పొలిట్ బ్యూరో సభ్యులకు ఎంతో విలువ ఉంటుంది. ప్రస్తుతం 164 మంది సభ్యులతో ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీకి సొంతంగా 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో కొంతమంది పొలిట్ బ్యూరో సభ్యులు ఉండగా, వారి బంధువులు, వారసులు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇక 22 మంది పొలిట్ బ్యూరో సభ్యుల్లో ఎక్కువ మంది చంద్రబాబు సహచరులు. దాదాపు 80 శాతం మంది 70 ఏళ్లు పైబడిన వారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు రిటైరయ్యే అవకాశం ఉన్నందున వీరి స్థానంలో ఇప్పుడే కొత్తవారిని పొలిట్ బ్యూరోలోకి తీసుకోవాలన్న ప్రతిపాదన పార్టీ పరిశీలిస్తోందని చెబుతున్నారు.

పార్టీలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే పొలిట్ బ్యూరో నియామకాల్లో 30 శాతం మంది కొత్తవారు, యువనాయకత్వానికి అవకాశమివ్వాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్ ప్రతిపాదిస్తున్నారు. పార్టీ భావినేత లోకేశ్ నోటి నుంచి ఈ మాట వచ్చిన నుంచి పొలిట్ బ్యూరోలో చంద్రబాబు సహచరులకు బైబై చెప్పడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామక్రిష్ణుడు, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేఈ క్రిష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, వర్ల రామయ్య, కిమిడి కళావెంకటరావు, నక్కా ఆనందబాబు, బాలక్రిష్ణ, ఎండీ షరీఫ్, ఎన్ఎండీ ఫరూక్, పితాని సత్యనారాయణరావులు చాలా సీనియర్లు. వీరి వయసు దాదాపు 70 ఏళ్లు. ఇక వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, గుమ్మడి సంధ్యారాణి మాత్రమే 50 ఏళ్లకు అటు ఇటుగా ఉన్నారు. దీంతో త్వరలో జరిగే పొలిట్ బ్యూరో నియామకాల్లో దాదాపు 14 మంది సీనియర్ నేతలపై వేటు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సీనియర్ నేతల్లో అశోక్ గజపతి, యనమల రామక్రిష్ణుడు ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తమ స్థానంలో వారసులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ప్రస్తుతం వీరు పార్టీ పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే వీరిని ఈసారి కొనసాగిస్తారా? లేదా? అనేది చూడాల్సివుంది. ఇక కేఈ క్రిష్ణమూర్తి కూడా వయసు మీరడంతో రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. సోమిరెడ్డి, వర్ల రామయ్య, ఫరూక్, షరీఫ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు వంటి వారు వయోభారంతో సతమతమవుతున్నారు. దీంతో వీరి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని పార్టీ భావిస్తోందని చెబుతున్నారు. వీరంతా అధినేత చంద్రబాబు సహచరులే కావడం గమనార్హం.

వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బాధ్యతలను యువనేత లోకేశ్ కు అప్పగించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వంలో లోకేశ్ ప్రాధాన్యం పెంచాలని, ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని కూడా కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో తన జట్టుకు కీలక బాధ్యతలు అప్పగించేలా లోకేశ్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ ఆలోచనతోనే పొలిట్ బ్యూరోలోకి యువరక్తం ఎక్కించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో ఉన్న వారిలో శ్రీనివాసులురెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, గల్లా జయదేవ్, కొల్లు రవీంద్ర వంటి కొద్ది వారిని మాత్రమే కొనసాగించాలని అనుకుంటున్నారని సమాచారం.

ఇక కొత్తగా పొలిట్ బ్యూరోలోకి వచ్చేవారిలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్, పరిటాల శ్రీరామ్, టీజీ భరత్, విశాఖ ఎంపీ భరత్, యనమల దివ్య, మంత్రి సవిత, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటివారి పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో లోకేశ్ ముద్ర స్పష్టంగా ఉండాలంటే ప్రత్యర్థులతో రాజీపడకుండా ఫైట్ చేసే నాయకులు కావాలని లోకేశ్ భావిస్తున్నారు. అందుకే తనకు బాగా సన్నిహితమైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని లోకేశ్ యోచిస్తున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News