"నిక్కర్ లోకేష్-కట్ డ్రాయర్ జగన్''
ఏపీలో సోషల్ మీడియా వ్యాఖ్యలు అడ్డు కట్ట వేయలేనంతగా దూసుకుపోతున్నాయి.
ఏపీలో సోషల్ మీడియా వ్యాఖ్యలు అడ్డు కట్ట వేయలేనంతగా దూసుకుపోతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం సోషల్ మీడియాలో దుమారం రేపేవారిని అడ్డుకుంటున్నా.. మరోవైపు.. అధికారికంగా టీడీపీ-వైసీపీ ఖాతాల్లో జరుగుతున్న దుమారం మాత్రం ఆగడం లేదు. అంటే.. ఓవర్ హెడ్ ట్యాంక్ దుమ్ము పట్టుకుపోయింది. కానీ, క్షేత్రస్థాయిలో కుళాయిలు మాత్రం బాగుండాలనే ఉద్దేశంగా ఇరు పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య అధికారిక ఖాతాల్లోనే వివాదాస్పద వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి.
వైసీపీ అధికారిక ఖాతాలో మంత్రి నారా లోకేష్‌ను దుయ్యబడితే.. మేం మాత్రం తక్కువగా కనిపిస్తున్నామా ? అంటూ.. టీడీపీ అధికారిక ఖాతాలో అంతే వేగంగా కామెంట్లు కురుస్తున్నాయి. ఈ పరిణామాలు.. రెండు పార్టీలను అభిమానించే వారిపై ప్రభావం చూపుతున్నాయి. ఒకవైపు సోషల్ మీడియా పారదర్శకంగా ఉండాలని చెబుతూనే ఇలా రెండు పార్టీలు హద్దులు చెరిపేసుకోవడం ఏంటనే చర్చ కూడా సాగుతోంది.
తాజా పరిణామాలను గమనిస్తే.. మంత్రి నారా లోకేష్.. నిక్కర్ లోకేష్ అని వైసీపీ కామెంట్ చేసింది. `మాజీ సీఎం జగన్‌ను కట్ డ్రాయర్ జగన్` అంటూ టీడీపీదుమ్మెత్తి పోసింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా దుమారం ఇప్పట్లో ఆగేలా లేదన్న సంకేతాలు అయితే వచ్చాయి.
అసలు ఏం జరిగింది?
నారా లోకేష్ సమీక్షల్లో స్టేషనరీ ఖర్చులు రూ.కోట్లు దాటిపోయాయని.. ఇదంతా ఏంటి? నిక్కర్ నారా లోకేష్ అంటూ.. వైసీపీకామెంట్లు చేసింది. దీనికి బదులుగా వైసీపీ హయాంలో స్టేషనరీ ఖర్చుల కోసం ప్రజాధనాన్ని రూ.కోట్లు మింగేశారని.. ఇదేంటి కట్ డ్రాయర్ జగన్ అంటూ.. టీడీపీ ఎదురు దాడి చేసింది. ఇక, అక్కడితో ఆగకుండా.. జగన్ ను అసెంబ్లీ అంటే భయపడే పులివెందుల పిల్లి అని, కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ వ్యాఖ్యలు కుమ్మరించింది.
దీనికి వైసీపీ బదులిస్తూ.. ``జగన్ పై, ఆయన ప్రభుత్వంపై ఊరికే నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు నిక్కర్ మంత్రి.. నారా లోకేష్.. నీకు దమ్మూ, ధైర్యం ఉంటే విచారణ చేసి వాస్తవాలను బయట పెట్టు.`` అని వ్యాఖ్యానించింది. ఇలా.. ఇరు పక్షాల మధ్య నిక్కర్-కట్ డ్రాయర్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే.. ప్రధాన పార్టీల ఎక్స్ ఖాతాలే ఇలా వ్యాఖ్యలు చేస్తే.. క్షేత్రస్థాయిలో ఉండేవారు రెచ్చిపోరా? అనేది ప్రశ్న.