అమిత్ షాకు రెడ్ కార్పెట్
కేంద్ర హోం మంత్రి దేశానికి పెద్ద బీజేపీ అగ్ర నేత అయిన అమిత్ షా తీరిక చేసుకుని ఏపీకి వచ్చారు.
కేంద్ర హోం మంత్రి దేశానికి పెద్ద బీజేపీ అగ్ర నేత అయిన అమిత్ షా తీరిక చేసుకుని ఏపీకి వచ్చారు. ఆయన స్థాయికి తగినట్లుగా కూటమి ప్రభుత్వం రాచ మర్యాదలనే చేసింది. శనివారం రాత్రి పొద్దు పోయిన తరువాత ఢిల్లీ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో దిగిన అమిత్ షాకు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు ఇతర టీడీపీ మంత్రులు కూడా అమిత్ షాకు పుష్ప గుచ్చాలు ఇచ్చి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
ఇక బీజేపీ తరఫున ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి స్వాగతం పలికారు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, శ్రీనివాస వర్మ కేంద్ర హోం మంత్రికి స్వాగతం పలికారు. జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ హోం మంత్రికి స్వాగతం పలికారు
ఇక అక్కడ నుంచి నేరుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్ర హోం మంత్రికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సాదర ఆహ్వానం పలికారు. ఆ తరువాత చంద్రబాబు నివాసంలో అమిత్ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే అమిత్ షాకు అక్కడ లోకేష్ ఇక్కడ బాబు స్వాగతం పలకడం ద్వారా ప్రోటోకాల్ ని పూర్తి స్థాయిలో పాటించారు. అంతే కాదు అమిత్ షాకు రాచ మర్యాదలకు ఏ మాత్రం లోపం లేకుండా చూసుకున్నారు.
మరో వైపు చూస్తే అమిత్ షాకు చంద్రబాబు ప్రత్యేకంగా విందుని ఏర్పాటు చేశారు. పెద్దాయన చంద్రబాబు ఇంటికి రావడం ఇదే మొదటి సారి కావడంతో బాబు ప్రతిష్ట గా తీసుకుని ఆయన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఇక బీజేపీ అగ్ర నేతలు తెలంగాణా నుంచి కూడా అమిత్ షా కోసం ఏపీకి వచ్చారు. ఇక రెండు రోజుల పాటు ఏపీలో ఉండే అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు. మొత్తానికి అమిత్ షా రాకతో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.