ఎన్టీఆర్ కుటుంబం చెప్పింది.. మ‌నం పాటించాలి: కొడాలి నాని

''చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్యే కోరింది. నారా భువనేశ్వరి తన మనసులో ఉన్న మాటనే బయటపెట్టింది

Update: 2024-02-22 18:18 GMT

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు. ఇప్పుడు ఇది మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. నిత్యం ఎన్టీఆర్ కుటుంబంపై విమ‌ర్శ‌లు గుప్పించే వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే కొడాలి నాని.. తాజాగా ఉద్దేశం ఏదైనా.. ఎన్టీఆర్ కుటుంబం చెప్పింది.. మ‌నం పాటించాలంటూ.. ప్ర‌చారానికి దిగారు. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుమార్తె, చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు.

''చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్యే కోరింది. నారా భువనేశ్వరి తన మనసులో ఉన్న మాటనే బయటపెట్టింది. ఎన్టీఆర్ బిడ్డ అడిగిన కోరికను మనమంతా గౌరవించాలి. ఎన్టీఆర్ మీద, ఆయన కుమార్తె మీద గౌరవంతో ఐదుకోట్ల మంది కలిసి చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం. ఎన్టీఆర్ పిల్లలు బాబుగారికి రెస్ట్ కావాలని అడుగుతున్నారు. రాజశేఖర్ రెడ్డిగారి అబ్బాయి(జ‌గ‌న్) కూడా బాబుగారికి రెస్ట్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఇద్దరు అగ్రనాయకులు పిల్లలూ చంద్రబాబుకు రెస్ట్ కావాలంటున్నారు. రాష్ట్ర ప్రజ లంతా ఆలోచించుకుని చంద్రబాబుకు రెస్ట్ ఇప్పిద్దాం. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి భువనేశ్వరికి అప్పచెబుతాం'' అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌ల వెనుక వ్యంగ్యం, వెట‌కారం.. రాజ‌కీయం అన్నీ ఉన్నాయి. కానీ, క్షేత్ర‌స్తాయిలో వీటి ప్ర‌బావం కూడా అంతే ఉంటే .. టీడీపీకి ఇబ్బందిగానే మార‌నుంది. ఇక‌, రాజ‌ధానిపైనా కొడాలి నాని నోరు చేసుకున్నారు. 'రాజధానితో సామాన్య ప్రజలకు పనేముంటుంది? అని ప్ర‌శ్నించారు. రాజధానిలో సెక్రటేరియట్ , అసెంబ్లీ, కోర్టు...కొన్ని ఆఫీసులు కడతాం..అంతకంటే ఏముంటాయ్? అని అన్నారు.

33 వేల ఎకరాల్లో ప్రభుత్వం రాజధాని కట్టడమేంటి ...ఎవరి డబ్బు తీసుకెళ్లి పెడతాడు అని వ్యాఖ్యానించారు.

''చంద్రబాబు తీసుకున్న రాజధాని నిర్మాణం ఒక గుదిబండ. విశాఖపట్నం రాజధానిగా అన్ని రకాలుగా అనువైన ప్రాంతం. జగన్ మోహన్ రెడ్డి రాజధాని నిర్మించలేకపోయాడంటున్నారు. ఈ భారతదేశంలో రాజధానిని నిర్మించిన వాడిని ఎవడైనా ఉన్నాడా...చూపించమనండి. రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు చెప్పే సొల్లు కబుర్లు నమ్మొద్దు. రైతులకు , మహిళలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు చేశాడా? జ‌గ‌న్ పింఛన్ 3 వేలు చేస్తానన్నాడు..చేసి చూపించాడు'' అని కొడాలి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News