అన్నదమ్ముల బంధం...పొత్తు కంటే మెత్తనైనది!
ఇపుడు తన అన్న పవన్ అని ఆ అనుబంధాన్ని లోకేష్ చెప్పకనే చెప్పారని వైసీపీ నుంచి సెటైర్లు వస్తున్నాయి.
ఇన్నాళ్ళకు నాకు ఒక అన్న దొరికాడు అని ఒక సినిమా పాట ఉంది. ఇపుడు ఆ పాటను పదే పదే పాడుకుంటున్నారు టీడీపీ భావి వారసుడు నారా లోకేష్. నాకు అన్నగా పవన్ నిలబడ్డారు అని లోకేష్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నేను ఒంటరిని కాదు అని ఆయన అంటున్నారు.
ఒక పక్క తండ్రి చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. మరో వైపు నారా లోకేష్ రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి యధాప్రకారం వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు కురిపించారు. సైకో జగన్ కాదు స్నేక్ జగన్ అని మరో గట్టి మాట వాడేశారు. పాముకు తలలోనే విషం జగన్ కి నిలువెల్లా విషమే అని కూడా అనేశారు.
తన తండ్రి ఎపుడూ నిప్పే అన్నారు. ఏ తప్పూ చేయలేదని కూడా లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక తన పోరాటానికి ఆరాటానికి మద్దతు ఇస్తున్న పార్టీలకు ధన్యవాదాలు అని తెలియచేశారు. మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మాత్రం అన్నగా అభివర్ణించారు. నాకు అండగా అన్న నిలబడ్డారు అని సంబరపడ్డారు.
నిజంగా ఇది కొత్త బంధమే అని చెప్పాలి. సరికొత్త సంబోధనగా కూడా చెప్పాలి. వైసీపీ వాళ్ళు అయితే ఎన్నో సార్లు సొంత పుత్రుడు, దత్తపుత్రుడు అని లోకేష్ ని పవన్ కి కలిపి మరీ విమర్శిస్తూంటారు. ఇపుడు తన అన్న పవన్ అని ఆ అనుబంధాన్ని లోకేష్ చెప్పకనే చెప్పారని వైసీపీ నుంచి సెటైర్లు వస్తున్నాయి.
మరో వైపు చూస్తే టీడీపీ జనసేన వేరు పార్టీలు అయినా ఆ అనుబంధం కూడా చాలా గొప్పగా సాగుతోంది అని వైసీపీ నుంచే విమర్శలు వస్తాయి. పవన్ కి సొంత పార్టీ మీద ఉన్న శ్రద్ధ కంటే టీడీపీ మీద ఉన్న ప్రేమ ఎక్కువ అని అంటారు. అసలు చంద్రబాబే పవన్ చేత పార్టీ పెట్టించారు అనేంతగా కూడా విమర్శలు చేస్తూ ఉంటారు.
సరే ఇవన్నీ రాజకీయ విమర్శలు అనుకున్నా అనుబంధాన్ని అయితే నారా లోకేష్ పవన్ తో పెంచేసుకున్నారు. అన్నగా చెప్పి మరీ మరింత దగ్గర చేసేసుకున్నారు. ఎటూ పొత్తుకు జనసేన టీడీపీ సుముఖంగా ఉన్నాయి. సీట్ల దగ్గర పంచాయతే అయితే ఉంటుందని అంతా అనుకున్న కూడా ఇపుడు అలాంటి పేచీ పూచీలే లేకుండా పొత్తు కలవబోతోందా అన్న డౌట్లూ వస్తున్నాయి.
నారా చంద్రబాబు ఫ్యామిలీకి పెద్దన్నగా పవన్ అండగా ఉంటే ఇక అంతా హుషారే కదా అని టీడీపీ శ్రేణులూ సంతోషిస్తున్నారు. ఎపుడూ టీడీపీ సొంతంగా వంద సీట్లు అని ప్రకటించే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు జనసేన టీడీపీ కలిస్తే ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమని లేటెస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంతే పవన్ ఇపుడు టీడీపీకి ఎంతగా దగ్గరయ్యారో కదా అంటున్నారు అంతే కాదు నారా వారి ఫ్యామిలీ మెంబర్ కూడా అయిపోయారు. లోకేష్ మాటలలో అయితే ఆయనకు అన్న. సో పవన్ బాగా టీడీపీకి కనెక్ట్ అయిపోయారు ఇక వెనక్కు పోలేరు అని కూడా అంటున్నారు.