2019లో ఈవీఎంలు బాగా పనిచేశాయా జగన్?: లోకేష్

2019 ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఈవీఎంల పనితీరు గురించి జగన్ విడుదల చేసిన వీడియోను లోకేష్ ప్రస్తావించారు

Update: 2024-06-18 14:52 GMT

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. వైసీపీపై ప్రజావ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నందునే ఆ పార్టీ కనీవిని ఎరుగని రీతిలో ఓటమిపాలైందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కావాలంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పై జగన్ చేసిన ట్వీట్ కు లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

2019 ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఈవీఎంల పనితీరు గురించి జగన్ విడుదల చేసిన వీడియోను లోకేష్ ప్రస్తావించారు. ప్రజాతీర్పును అంగీకరించాల్సిందేనని, జగన్ కు ప్రజాస్వామ్యం అంటే గిట్టదని లోకేష్ అన్నారు. ప్రజా హక్కుల పరిరక్షణకు ఏర్పడిన సంస్థలు, వ్యవస్థలు, వేదికలను జగన్ క్రమంగా నాశనం చేస్తూ వచ్చారని లోకేష్ అన్నారు. వ్యవస్థలను ఒక్క దెబ్బతో కూల్చేశారని ఎద్దేవా చేశారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎంలు చక్కగా పనిచేసినట్టా? 2024 లో ఓడిపోతే పని చేయనట్టా? అని జగన్ ను లోకేష్ ప్రశ్నించారు.

తన పదవీకాలంలో జగన్ ప్రజారంజక పాలనను అందించడంలో విఫలమయ్యారని, అందుకే వైసీపీని ప్రజలు తిరస్కరించారని లోకేష్ అన్నారు. ఈ విషయాన్ని జగన్ ఇకనైనా గుర్తించాలని హితవు పలికారు. ఫర్నిచర్ ను ఎప్పుడు తిరిగి అప్పగిస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు. 560 కోట్ల ప్రజాధనాన్ని రుషికొండ ప్యాలెస్ కోసం ఎందుకు ఖర్చు పెట్టారో చెప్పాలని లోకేష్ నిలదీశారు.

Tags:    

Similar News