అహంకారానికి ఆత్మ గౌరవానికి యుద్ధం అంటున్న లోకేష్ !

ఏపీలో వచ్చే ఎన్నికల్లో జరిగేది అహంకారానికి ఆత్మ గౌరవానికి యుద్ధం అని నారా లోకేష్ స్పష్టం చేశారు

Update: 2023-12-20 16:15 GMT

ఏపీలో వచ్చే ఎన్నికల్లో జరిగేది అహంకారానికి ఆత్మ గౌరవానికి యుద్ధం అని నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్ ఎపుడూ పేదలకూ పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ వచ్చారు. దాన్ని ట్విస్ట్ చేసి నారా లోకేష్ జగన్ అహంకారం అని కొత్త ట్యాగ్ తో నినాదం ఇచ్చారు.

జగన్ కి చలికాలంలో ఉక్క బోత పట్టుకుందని టీడీపీ జనసేన సూపర్ హిట్ అని ఇది బ్లాక్ బస్టర్ బొమ్మ అని లోకేష్ చెప్పారు. చంద్రబాబు పవన్ అంటే జగన్ కి భయం అని లోకేష్ చెప్పుకొచ్చారు. లోకేష్ ని చూసినా భయమే అని జగన్ భయం అంతా ఓటమి గురించే అని లోకేష్ విశ్లేషించారు.

చంద్రబాబు విజనరీ జగన్ ప్రిజనరీ అని బాబు జైలుకు వెళ్తే ఆయన చేసిన అభివృద్ధి అంతా ప్రజలు చర్చించుకున్నారని అదే జగన్ జైలుకు వెళ్తే ఆయన చేసిన స్కాములన్నీ బయటకు వచ్చాయని దటీజ్ చంద్రబాబు అని తండ్రిని పొగిడారు. ఇక పవన్ అన్న అంటూ ఆయన మీద పొగడ్తలు కురిపించారు.

పవన్ అన్న ఏపీకి వస్తామంటే ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తారు, ఆయన వారాహి యాత్రను అడ్డుకుంటారు, ఇదంతా ఎందుకు అంటే భయంతోనే అని లోకేష్ చెప్పుకొచ్చారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రజాస్వామ్యం తిరగబడి దెబ్బ తీస్తే అది ఎలా ఉంటుందో 2024 ఎన్నికల్లో జగన్ కళ్ళారా చూస్తారని హెచ్చరించారు.

జగన్ అహంకారాన్ని ప్రజలే 151 గోతి తీసి పాతిపెడతారు అని శాపనార్ధాలూ పెట్టారు. అంటే 151 సీట్లు వచ్చిన వైసీపీకి ఈసారి ఘోర పరాజయం తప్పదని లోకేష్ జోస్యం చెప్పారన్న మాట. చంద్రబాబు పవన్ రాష్ట్రానికి కావాల్సిన నాయకులు అని లోకేష్ అన్నారు. అనుభవం కలిగిన చంద్రబాబు కావాలని పవన్ కోరుకున్నారని లోకేష్ చెప్పడం విశేషం.

ఇదిలా ఉండగా పాదయాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పించిందని లోకేష్ చెప్పారు. గడచిన అయిదేళ్లలో రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో తన ప్రతీ అడుగులో కనిపించింది అని లోకేష్ అన్నారు. ఏపీలో ఉద్యోగాలు లేక యువగ బయటకు వెళ్తున్న పరిస్థితి ఉందని లోకేష్ అన్నారు. అలాగే నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని మహిళలు సహా అన్ని వర్గాలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని కళ్లారా చూశాను అన్నారు లోకేష్.

ఈ పరిస్థితి మార్చేందుకు ఏపీలో వైసీపీ గద్దె దిగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మరో మూడు నెలలు ఆగితే ప్రజా పాలన వస్తుందని లోకేష్ జోస్యం చెప్పడం విశెషం. మొత్తానికి లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చేసారు.

Tags:    

Similar News