లోకేష్ చుట్టూ టీడీపీ ...?

నిజానికి టీడీపీలో చంద్రబాబు చాలా వరకూ నియోజకవర్గాలను సమీక్ష చేశారు.

Update: 2023-10-14 16:00 GMT

చంద్రబాబు అన్నీ తానే అంటూ నడిపించిన టీడీపీ ఇపుడు నెల రోజులకు పైగా ఆయన లేని లోటుని చూస్తోంది. చంద్రబాబు పని రాక్షసుడిగా ముద్ర పడ్డారు. పైగా ఎవరినీ నమ్మరని అంటారు. దాంతో ఆయన పార్టీని ఒంటి చేత్తో నడిపించారు. అలాంటి బాబు జైలు గోడల మధ్య నలుగుతూంటే పార్టీలో చాలా అయోమయం అయితే నెలకొంది అని అంటున్నారు. పార్టీలోని సీనియర్లు అంతా ఒక వైపు ఉంటే జూనియర్లు అంతా లోకేష్ చుట్టూ కనిపిస్తున్నారు.

అదే విధంగా రేపటి ఎన్నికల్లో టికెట్ల కోసం ప్రయత్నం చేసతున్న వారు అంతా కూడా లోకేష్ ని మంచి చేసుకుంటున్నారు. నిజానికి టీడీపీలో చంద్రబాబు చాలా వరకూ నియోజకవర్గాలను సమీక్ష చేశారు. ఆయన వందకు పైగా సీట్లలో అభ్యర్ధులను కూడా ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

తొలి విడత సీట్లను తొందరలో అనౌన్స్ చేయాలని కూడా బాబు అనుకుని ఉన్నారు. కానీ విధి వక్రించి ఆయన జైలు గోడల మధ్యన పరిమితం అయ్యారు. దాంతో ఇపుడు చినబాబు టీడీపీకి కేంద్ర బిందువుగా మారుతున్నారు. నిజానికి చూస్తే తెలుగుదేశం పార్టీకి ఏపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు ఉన్నారు. అలాగే సీనియర్ పొలిట్ బ్యూరో మెంబర్ గా యనమల రామక్రిష్ణుడు ఉన్నారు. పూసపాటి అశోక్ గజపతిరాజు లాంటి వారు అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్లు ఉన్నారు.

ఇక పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే పార్టీని నడిపించేందుకు ఇవేమీ పెద్దగా పనిచేస్తున్నట్లుగా లేవు అని అంటున్నారు. పార్టీ అంటే లోకేష్ మాత్రమే అని కొందరు ఇంప్రెషన్ కలిగిస్తున్నారు. ఇక పొలిటికల్ యాక్షన్ కమిటీలో బాలక్రిష్ణ ఉన్నారు. ఆయన తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మొదట్లో ఆయన వచ్చి హడావుడి చేసినా ఎందుకో సైలెంట్ అయి దూరం జరిగారు అని అంటున్నారు.

ఇక ఎంతటి సీనియర్ నేతలు అయినా చంద్రబాబు కుమారుడిగా లోకేష్ కి ఉన్న అవకాశాలు వేరు కాబట్టి అంతా ఎవరి మటుకు వారుగా మౌనంగా ఉంటూ సమయానుకూలంగా స్పందిస్తున్నారు. ఇక లోకేష్ ఢిల్లీ టూ రాజమండ్రి చక్కర్లు కొడుతున్నారు. లోకేష్ కి చంద్రబాబు తో డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఆయన అనేక దఫాలుగా ములాఖత్ అవుతున్నారు. అయితే ఆయన బాబు ఇచ్చిన దాన్ని పార్టీ పెద్దలకు బ్రీఫింగ్ ఇచ్చి ఆ దిశగా పార్టీని అందరితో కలసి నడిపించే ప్రయత్నం అయితే చేయాలి.

కానీ లోకేష్ మాత్రం తన దగ్గరకు వచ్చిన వారితోనే తాను అన్నట్లుగా ఉంటున్నారు. పైగా ఆయన ఢిల్లీలో ఉంటూ అందుబాటులోకి రావడంలేదు అన్న చర్చ మరో వైపు ఉంది. మరో వైపు చూస్తే పార్టీ ప్రెసిడెంట్ కానీ లేక చంద్రబాబు నియమించిన పొలిటికల్ యాక్షన్ కమిటీ తరఫున కానీ ప్రకటించాల్సిన నిరసన కార్యక్రమాలను లోకేష్ ప్రకటిస్తున్నారు.

గత రెండు వీకెండ్స్ లోనూ గంట కొట్టి సౌండ్ చేయడం, లైట్లు ఆర్పడం వంటివి చేశారు. ఇపుడు ఈ ఆదివారం న్యాయానికి సంకెళ్ళు అంటూ ఎవరికి వారుగా తమ చేతులకు సంకెళ్ళు వేసుకుని నిరసన చేయాలని లోకేష్ ప్రకటించారు. దీంతో పార్టీలో లోకేష్ ప్రకటనలే కీలకం అవుతున్నాయి.

మరో వైపు ఇదే అదనుగా లోకేష్ చుట్టూ జూనియర్ నేతలు చేరి తమ ప్రాబల్యాన్ని పెంచుకునే యత్నం చేస్తున్నారు. ఎటూ సీనియర్లు తమ పరిధిలో తాముంటే ఈ అవకాశాన్ని జూనియర్లు తీసుకుంటున్నారు అని అంటున్నారు. చాలా చోట్ల టికెట్ల కోసం సీనియర్లు జూనియర్ల మధ్య వార్ నడుస్తోంది. ఇపుడు జూనియర్లు చినబాబు కంట్లో పడి తమ సీట్ల కోసం ప్రయత్నాలను స్టార్ట్ చేశారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కొన్ని సీట్లలో కొత్తగా కొంతమంది నేతలు తమ కోసం ప్రయత్నం చేసుకునేందుకు కూడా లోకేష్ కంట్లో పడుతున్నారు.

మొత్తానికి ఇవన్నీ చూసినపుడు బాబు బయటకు వచ్చే లోగా లోకేష్ చుట్టూ ఉన్న వారు తమ సీట్ల కోసం చేస్తున్న ప్రయత్నాలతో పార్టీలో టికెట్ల వార్ కొత్త మలుపు తీసుకుంటుందా అన్న చర్చ అయితే వస్తోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంతో ఏ రకంగా జరుగుతుందో.

Tags:    

Similar News