వైసీపీ ఎమ్మెల్యేకు లోకేష్ భరోసా... రాక్షస పాలన అంటూ నిప్పులు
వైసీపీలో జగన్ అన్న తన గుండెలలో ఉన్నారని అసెంబ్లీ వేదికగా ప్రసంగాలు చేసిన తాడికొండ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
వైసీపీలో జగన్ అన్న తన గుండెలలో ఉన్నారని అసెంబ్లీ వేదికగా ప్రసంగాలు చేసిన తాడికొండ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇపుడు టీడీపీ వేదికల మీద ప్రత్యక్షం అవుతున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గుంటూరు జిల్లాలో ఉన్నారు. ఆయన బాపట్ల మీదుగా తాడికొండకు ప్రవేశించారు.
ఈ సందర్భంగా తాడికొండలో జరిగిన సభలో నారా లోకేష్ తో పాటు ఉండవల్లి శ్రీదేవి కూడా వేదిక మీద కనిపించారు. లోకేష్ తో పాటు ఆమె కూడా ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. నియంతృత్వ పాలన అని మండిపడ్డారు అమరావతి రైతులకు చుక్కలు చూపించి వారిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం అన్నారు.
రాజధాని లేని చోట తాను ఎమ్మెల్యేగా ఉన్నాను అని జనాలు కూడా తనను చూసి నవ్వేవారు అని ఉండవల్లి శ్రీదేవి హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీది వెన్నుపోటు పాలన రాక్షస పాలన అని ఆమె దుయ్యబెట్టడం విశేషం. గడచిన నాలుగేళ్ళుగా తాను వైసీపీలో ఉంటూ రైతుల మనోవేదన చూసి కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాయని అన్నారు.
తనకు తాడికొండ రైతులే ముఖ్యమని అన్నారు. అమరావతి రాజధాని కోసం భొములు ఇచ్చిన రైతుల పక్షమే తాను అని ఆమె అన్నారు. అందుకే తాను ఇపుడు టీడీపీ వేదిక ద్వారా వారికి పూర్తి మద్దతు ఇస్తున్నానన్ని చెప్పారు. తనకు నారా చంద్రబాబు నారా లోకేష్ అండదండలుగా ఉన్నారని ఆమె చెప్పారు. తాను ఆ ఇద్దరు ఇచ్చిన ధైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నానని అన్నారు.
ఇదిలా ఉండగా తాడికొండ టికెట్ విషయంలో ఉండవల్లి శ్రీదేవికి నారా లోకేష్ నుంచి భరోసా దక్కిందని అంటున్నారు. అయితే అదే వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్యే 2014లో తాడికొండలో టీడీపీ నుంచి గెలిచిన శ్రావణ్ కుమార్ మాత్రం ఉండవల్లి శ్రీదేవి పార్టీలోకి రావడాన్ని ఎలా స్వాగతిస్తారు అన్నది చూడాలని అంటున్నారు. ఆయన 2024 ఎన్నికలలో తనకే టికెట్ అని ఆశపెట్టుకున్నారు.
అయితే టీడీపీ కూడా వ్యూహాత్మకంగా ఉండవల్లి శ్రీదేవిని బరిలోకి దింపే చాన్స్ ఉందని అంటున్నారు. ఆమె వైసీపీలో జగన్ కి ఆయన ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలు. పైగా డాక్టర్. అంగబలం అర్ధబలం ఉన్న నేత. నిండు అసెంబ్లీలో తన గుండే జగన్ అని కొట్టుకుంటోంది అని చెప్పి మాట్లాడిన నేత. అలాంటి ఆమె వైసీపీ మీద విమర్శలు చేస్తే కచ్చితంగా జనాలకు ఎక్కుతుందని ఫలితంగా తాడికొండతో పాటు ఇతర సీట్ల మీద కూడా ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు.
దాంతో శ్రావణ్ కుమార్ కంటే శ్రీదేవి వైపే టీడీపీ అధినాయకత్వం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో తాడికొండలో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు ఉండవల్లి శ్రీదేవి మీద ఎవరిని బరిలోకి దించుతారు అన్నది చూడాల్సి ఉంది.