పుంగనూరును గుర్తుకు తెచ్చిన భీమవరం... ఆసుపత్రిలో పోలీసులు!

తాజాగా భీమవరం లోనూ పోలీసులపై దాడులు జరిగాయి.

Update: 2023-09-06 04:08 GMT

టీడీపీ చేపడుతున్న పాదయాత్రలు, బహిరంగ సభల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం.. కార్యకర్తలను రెచ్చగొట్టడం, పోలీసులపైనా వైసీపీ కార్యకర్తలపైనా దాడులకు తెగబడటం కామన్ అయిపోయిందనే కామెంట్లు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా తాజాగా భీమవరం లోనూ పోలీసులపై దాడులు జరిగాయి. దీంతో... ఊరు పేరు మారిందే తప్ప టీడీపీ కార్యకర్తల తీరు మారలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అవును... పుంగనూరులో జరిగిన అత్యంత హేయమైన, దారుణమైన ఘటన మరువకముందే తాజాగా ప్రశాంతంగా ఉండే భీమవరంలో కూడా దాదాపు అలాంటి ఘటనే జరిగింది. కాకపోతే పుంగనూరులో చంద్రబాబు మీటింగ్ లో జరగ్గా.. భీమవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే... నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భీమవరంలో గనుపూడి సెంటర్‌ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మరోసారి రెచ్చగొట్టే ప్రసంగానికి పాల్పడ్డారు! భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీను పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తన పాదయాత్ర, అందులో భాగంగా నిర్వహించే సభలు, రోడ్ షోలలో కేవలం స్థానిక వైసీపీ నేతలను నోటికి వచ్చినట్లు తిట్టడం, టీడీపీ కార్యకర్తలను రెచ్చగోట్టి దాడులకు పాల్పడేలా చేయడమే పనిగా పెట్టుకున్నారు అనే విమర్శలను ఎదుర్కొంటున్న నారా లోకేష్... భీమవరంలోనూ అదే పనికి పూనుకున్నారు! ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యేని కబ్జాకోరుగా అభివర్ణించారు. గజదొంగ అంటూ గ్రంధి శ్రీనివాస్‌ ను ఉద్దేశించి విమర్శించారు!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటుంటే.. గ్రంధి శ్రీనివాస్ భీమవరంలో దోపిడీలకు పాల్పడుతున్నాడంటూ ధ్వజమెత్తారు. అనంత్గరం వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. కనీసం డజను కేసులను పెట్టించుకోవాలని, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ కనిపించినా తరిమి కొట్టాలని పదే పదే పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు!

ఈ సమయంలో... రోడ్డు పక్కన వైసీపీ జెండాలు చేతపట్టి నిల్చుని నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలు, గ్రంధి శ్రీనివాస్ అనుచరులపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. వారిపైనా రాళ్లు విసరడంతో ముగ్గురు పోలీసులకు గాయాలవ్వగా... వారిని హుటాహుటిన భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అంతకుముందే భీమవరంలో వైఎస్ జగన్‌ కు చెందిన భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలను నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలు చించివేశారు. దీంతో వైసీపీ నాయకులు నిరసన తెలియజేశారు. అనంతరం వాటిని మళ్లీ కట్టుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు! దీంతో... శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లోకేష్ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలు ఎవరి కోసమని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

Tags:    

Similar News