ఎన్నికలకు ముందు ఈ చికాకులేంటో ?
నారాయణ విద్యాసంస్థల యజమాని టీడీపీ ప్రముఖ నేత నారాయణకు ఇంటిపోరు పెరిగిపోతోంది
ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మరోవైపు నారాయణ విద్యాసంస్థల యజమాని, టీడీపీ ప్రముఖ నేత నారాయణకు ఇంటిపోరు పెరిగిపోతోంది. తనపై తమ్ముడు సుబ్రమణ్యం భార్య అంటే మరదలే లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. తనను నారాయణ 29 ఏళ్లుగా లైగికంగా వేధిస్తున్నట్లు ఆమె పదేపదే ఆరోపిస్తున్నారు. ఆరోపణలతో సరిపెట్టుకోకుండా హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు వల్ల ఏమవుతుందన్నది ప్రశ్నకాదు. కాకపోతే నారాయణ ఇమేజికి డ్యామేజీ అయితే అయ్యిందన్నది వాస్తవం.
రాబోయే ఎన్నికల్లో నెల్లూరు సిటి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి నారాయణ రెడీ అయిపోయారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, మద్దతుదారులతో రెగ్యులర్ గా సమావేశాలవుతున్నారు. నెల్లూరు సిటిలో నారాయణే పోటీచేస్తారని చంద్రబాబునాయుడు కూడా ప్రకటించేశారు. చాలాకాలం ఈ మాజీమంత్రి రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. రాజకీయ కారణాలు, వివిధ కేసుల కారణంగా తెరవెనకకు మాత్రమే పరిమితమయ్యారు.
అలాంటి నారాయణ రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇపుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే నారాయణపై అనేక కేసులున్నాయి. 10వ తరగతి ప్రశ్నపత్నం లీకేజీ కేసులో అరెస్టయి బెయిల్ మీద తిరుగుతున్నారు. అమరావతి ల్యాండ్ స్కామ్ లో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సీఐడీ ఫ్రీజ్ చేసింది. వీటన్నింటినీ తట్టుకుని నారాయణ టీడీపీలో యాక్టివ్ అయి ఇపుడే ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో మరదలే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటం ఇబ్బందికరమనే చెప్పాలి.
రాయదుర్గం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది కాబట్టి చట్టపరంగా ఆయనకేదో అయిపోతుందని కాదు. కానీ ఇదే విషయాన్ని ప్రత్యర్ధులు రేపటి ఎన్నికల్లో పదేపదే ప్రచారంలోకి తీసుకురాకుండా ఉండరు. మహిళలను వేధించటం, అక్రమసంబంధాలన్నవి సమాజంలో ముఖ్యంగా మహిళలపై పెద్ద ప్రబావం చూపుతాయనటంల సందేహంలేదు. కుటుంబంలో ఏమి జరిగిందన్నది బయటవాళ్ళకి తెలీదు. అందుకనే మరదలు కృష్ణప్రియ వేధింపులపై ఆరోపణలతో సోషల్ మీడియాలో రచ్చజరిగేంత పరిస్ధితిని నారాయణ రాకుండా చూసుకోవాల్సింది. మరి దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎలాగుంటుందో చూడాల్సిందే. వేధింపులన్నది ఎంతైనా చికాకు కలిగించే విషయమే.