ఐఆర్ఆర్ కేసులో నారాయణకు ఉపశమనం.. ఎప్పటివరకంటే...?

ఇలా ఈ నెల 4, బుధవారం విచారణకు హాజరుకావాల్సిన నేపథ్యంలో నారాయణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2023-10-03 11:57 GMT

మాజీమంత్రి నారాయణకు టెంపరరీగా ఉపశమనం లభించిందనే అనుకోవాలి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం కేసులో ఏ2 గా ఉన్న నారాయణను ఈనెల 4న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు పంపింది. ఇదే సమయంలో అదేరోజు విచారణకు రావాలంటూ నారా లోకేష్ కు కూడా సీఐడీ 41ఏ నోటీసులు అందించింది.

అవును... మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పుల విషయంలో చంద్రబాబు అనంతరం నారాయణ పాత్ర కీలకం అని భావిస్తోన్న సీఐడీ అధికారులు ఆ కేసులో ఆయనను ఏ2గా చేర్చారు! ఈ క్రమంలో తాజాగా ఈ నెల 4న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించింది.

ఇలా ఈ నెల 4, బుధవారం విచారణకు హాజరుకావాల్సిన నేపథ్యంలో నారాయణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా... 65 సంవత్సరాల వయసున్న తాను ప్రత్యక్ష విచారణకు హాజరు కావాలని ఆదేశించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమంటూ పిటిషన్ వేశారు. తనను ఇంటి వద్దే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

దీంతో... ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు.. ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ సమయంలో... తమకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. దీంతో ఏపీ హైకోర్టు కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ముందస్తు బెయిల్ పొడిగిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ప్రస్తుతానికి ఈ నెల 16 వరకూ నారాయణ బెయిల్ పై ఉంటారు!

మరోవైపు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41-ఏ కింద తనకు అందజేసిన నోటీసుల్లో సీఐడీ పేర్కొన్న షరతులను ప్రశ్నిస్తూ లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వాటాదారు మాత్రమే అయినప్పటికీ.. హెరిటేజ్ ఫుడ్స్ అకౌంట్స్ పుస్తకాలు, బ్యాంక్ పాస్‌ బుక్‌ లను సమర్పించమని సిఐడి కోరడం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు.

ఈ విషయాలపై తమ వాదనలు వినిపించిన సీఐడీ తరుపు న్యాయవాదులు... తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని తెలిపారు. ఇదే సమయంలో రేపు లోకేష్‌ విచారణకు హాజరు కావాలని కోరారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం అక్టోబరు 10న సీఐడీ విచారణకు లోకేష్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News