ప్రధాని అయ్యాక‌ మోదీ చూసిన తొలి సినిమా!

ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ మిత్రపక్షం జితన్ రామ్ మాంఝీ తదితరులు సినిమా చూసిన వారిలో ఉన్నారు.

Update: 2024-12-03 09:46 GMT

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి రెండున్న‌ర గంట‌ల పాటు సినిమా చూసేంత సీనుందా? అంటే.. సంద‌ర్భం వ‌స్తే ఎందుకు ఉండ‌దు? పార్లమెంటు లైబ్రరీ భవనంలోని బాలయోగి ఆడిటోరియంలో అధికార కూటమికి చెందిన ఎంపీలతో పాటు తన మంత్రివర్గంలోని పలువురు సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ `ది సబర్మతి రిపోర్ట్` చిత్రాన్ని వీక్షించారు. ఈ సినిమా కాన్సెప్ట్ ప్ర‌ధానిని ఆయ‌న అనుయాయుల‌ను థియేట‌ర్ కు లాక్కొచ్చింది.

ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ మిత్రపక్షం జితన్ రామ్ మాంఝీ తదితరులు సినిమా చూసిన వారిలో ఉన్నారు. 27 ఫిబ్రవరి 2002న గోద్రా వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం, మతపరమైన వేడుకలో పాల్గొని అయోధ్య నుండి తిరిగి వస్తున్న 59 మంది భక్తులను చంపడం వెనుక ఉన్న వాస్తవాన్ని ఈ చిత్రం రివీల్ చేసింది. స‌బ‌ర్మ‌తి రిపోర్ట్ సినిమా చూసిన తర్వాత ఎక్స్‌లో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ ప్రయత్నాన్ని ప్రధాని మోదీ అభినందించారు. అధికార భాజ‌పా ఈ మూవీని చురుగ్గా ప్రమోట్ చేస్తోంది. భాజ‌పా ఏలుబ‌డిలో ఉన్న‌ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రహితంగా చేశాయి.

ఇందులో విక్రాంత్ మాస్సే క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా, రాశీ ఖ‌న్నా ఒక కీల‌క పాత్ర‌ను పోషించింది. ప్రముఖ నటుడు జీతేంద్ర మ‌రో కీలక పాత్ర పోషించారు. ప్రివ్యూ అనంత‌రం అభిజీత్ - రాశిఖన్నా విలేకరులతో మాట్లాడుతూ ``ప్రధాని అయిన తర్వాత తాను చూసిన మొదటి సినిమా ఇదేనని ప్రధాని మోదీ తమతో చెప్పార``ని అన్నారు. ప్రధాని మోదీతో కలిసి సినిమా చూడటం మాటల్లో చెప్పలేని భిన్నమైన అనుభవం అని రాశీ ఖ‌న్నా అన్నారు. వెట‌ర‌న్ న‌టుడు జీతేంద్ర విలేఖరులతో మాట్లాడుతూ-``ప్రధానమంత్రితో కలిసి తన కుమార్తె ఏక్తా కపూర్ (సినిమా నిర్మాత‌ల‌లో ఒక‌రు) సినిమా చూడటం ఇదే మొదటి సారి`` అని తెలిపారు.

మతపరమైన అల్లర్లు జరిగిన సమయంలో ప్రధానిన‌రేంద్ర‌ మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొన్ని రైలు కోచ్‌లకు నిప్పు పెట్టడానికి ముస్లిం మూకలే కారణమని రాష్ట్ర పోలీసులు ఆరోపించారు. పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన చాలా మంది నిందితులను కోర్టులో దోషులుగా నిర్ధారించారు. కాంగ్రెస్‌ మిత్రపక్షమైన అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఏర్పాటు చేసిన విచారణ కమీషన్ ``ఇది కేవ‌లం అగ్ని ప్రమాదం`` అని పేర్కొనడంతో ఈ ఘటన పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. అయితే గుజరాత్ హైకోర్టు దాని నిర్ధారణలను రద్దు చేసింది. కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

Tags:    

Similar News