మోడీ వారి మొండి చేయి.. ఏపీ పై కృతజ్ఞత ఏదీ?
కేంద్రంలో మోడీ సర్కారు మూడో సారి ముచ్చటగా కొలువు దీరేందుకు.. ఏపీ కీలకమనే విషయం తెలిసిందే;
కేంద్రంలో మోడీ సర్కారు మూడో సారి ముచ్చటగా కొలువు దీరేందుకు.. ఏపీ కీలకమనే విషయం తెలిసిందే. ఏపీలో వచ్చిన ఎంపీ సీట్లే.. మోడీని కేంద్రంలో కూర్చోబెట్టాయి. కూటమిగా ఎన్నికలకు వెళ్లి.. ఇక్కడి 21 ఎంపీ స్థానాలను మోడీ దక్కించుకున్నారు. వీటిలో బీజేపీకి వచ్చింది మూడే.. కానీ, కూటమి పార్టీలైన టీడీపీకి 16, జనసేనకు 2 స్థానాలు వచ్చాయి. దీంతో సేఫ్‌గా మోడీ అధికారంలోకి వచ్చారు. మరి ఇంత చేసిన ఏపీకి.. ఆయన ఏమేరకు కృతజ్ఞత చూపించారంటే.. మాత్రం పెదవి విరుపులే కనిపిస్తున్నాయి.
దీనికి కారణం.. తాజా గా మోడీ సర్కారు తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. దీనిలో అనేక కీలక ప్రాజెక్టులకు వేలాది కోట్ల రూపాయలను కేటాయించారు. కానీ, ఒక్కటంటే ఒక్కటి ఏపీకి సంబంధించింది లేకపోవడం గమనార్హం. పైగా.. వచ్చే రెండు మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపైనే మోడీ మరోసారి కరుణ చూపించి.. ఎన్నికల రాజకీయానికి తెరదీశారు.
నిర్ణయాలు ఏంటి? ఏపీకి ఎలా అన్యాయం జరిగింది?
+ పోర్టులు, షిప్పింగ్ రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిధులు కేటాయించారు.
+ వీటిలో మహారాష్ట్రలోని విధావన్ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టు అభివృద్ధికి రూ.76,200 కోట్లను కేటాయించారు.
+ ఏపీలోనూ దుగరాజపట్నం, మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అంత భారీ మొత్తం కాకపోయినా.. 2 వేల కోట్లు కేటాయిస్తే.. ఈ పనులు పూర్తవుతాయి. కానీ, రూపాయి కూడా విదిలించలేదు.
+ ఇక, తమిళనాడు, గుజరాత్‌లో రూ.7,453 కోట్లతో 500 మెగావాట్ల సామర్థ్యంతో చెరొక ఆఫ్‌షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
+ ఏపీలోనూ అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి దశాబ్దకాలంగా నిధులు లేక, రాక మూలనపడ్డాయి. దీంతో ఎక్కువ ఖరీదు పెట్టి .. విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాం. ఈ విషయం తెలిసి కూడా.. మోడీ సర్కారు వీటిని పట్టించుకోలేదు.
+ మోడీ సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసిలో ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయడానికి రూ.2,869.65 కోట్లను కేటాయించారు.
+ ఏపీలో గన్నవరం ఎయిర్ పోర్టు విషయంలో నిధుల కొరతకారణంగా.. ఇప్పటికీ రైతులకు నిధులు చెల్లించలేదు. అదేవిధంగా విశాఖ ఎయిర్ పోర్టు విస్తరణలో భాగంగా రన్ వే పనులు(3.2 కిలో మీటర్లు) నిధులు లేక ఆగిపోయాయి. వీటికి కూడా.. మోడీ మొండి చేయే చూపించారు. మరి కూటమి పార్టీల ఎంపీలు అడగలేదా.. లేక.. మోడీనే పట్టించుకోలేదా.. అనేది తేలాలి.