ప్రధాని మోడీ సభకు చంద్రబాబు దూరం... ఇదేనా అసలు కారణం..?
పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి
పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. పార్టీ పెద్దలంతా ఎన్నికల ప్రచారాలతో బిజీ అయిపోయారు. అవిరామంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో... ప్రధాని నరేంద్ర మోడీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. అయితే... రాజమండ్రిలోని ప్రధాని సభకు కూటమిలోని కీలక నేత చంద్రబాబు హాజరుకావడం లేదు!
అవును... ఏపీలో పోలింగ్ తేదీకి సమయం దగ్గరపడుతున్న వేళ ప్రచార కార్యక్రమాలు హోరెత్తిపోతున్నాయి. ఇందులో భాగంగా... ప్రధాని మోడీ ఇవాళ రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం.. 8వ తేదీన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పీలేరులో సభకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారు.
ఈ క్రమంలో నేటి రాజమండ్రి సభకు మధ్యాహ్నం 3 గంటలకు రానున్నారు మొడీ. రాజమండ్రి నుంచి వేమగిరి సభా ప్రాంగణానికి చేరుకుని, అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో... రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో పాటు కూటమికి చెందిన ఇతర ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలంటూ ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేయనున్నారు.
ఇలా రాజమండ్రి సభ అనంతరం ప్రధాని మోడీ అనకాపల్లి వెళ్తారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున మోడీ ప్రచారం చేయనున్నారు. ఈ రెండు సభల తర్వాత ఈ నెల 8న ప్రధాని మరోసారి ఏపీకి రానున్నారు. ఇంద్లో భాగంగా... 8న మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడ నుంచి పీలేరు అసెంబ్లీ పరిధిలోని కలికిరి సభలో పాల్గొంటారు మోడీ!
అయితే... రాజమండ్రి సభలో కూటమి తరుపున మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ లు పాల్గొంటారు కానీ... చంద్రబాబు హాజరుకావడం లేదు! ప్రధాని మోడీ ఆకాశమార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉండటం వల్లే చంద్రబాబు రాజమండ్రి సభలో పాల్గొనటానికి సాధ్యం కాలేదని తెలుస్తుంది! అయితే... సాయంత్రం జరగబోయే అనకాపల్లి సభకు మాత్రం చంద్రబాబు హాజరవుతారని తెలుస్తుంది!