మోడీ వార్డ్ రోబ్ లో 250 జతల బట్టలు ఉన్నాయా?
దేశ ప్రధానిగా పదేళ్లు వ్యవహరించి.. మరో ఐదేళ్లు ప్రధానమంత్రిగా ఉండేందుకు వీలుగా ప్రజాతీర్పును కోరుతున్నారు నరేంద్ర మోడీ
దేశ ప్రధానిగా పదేళ్లు వ్యవహరించి.. మరో ఐదేళ్లు ప్రధానమంత్రిగా ఉండేందుకు వీలుగా ప్రజాతీర్పును కోరుతున్నారు నరేంద్ర మోడీ. తన పదేళ్ల పదవీ కాలంలో తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణ ఏమైనా ఉందంటే.. అది ఖరీదైన దుస్తుల్ని ధరిస్తారని.. పూటకో జత ధరించటం ఆయనకు అలవాటుగా పేర్కొంటారు. అన్నింటికి మించి విదేశీ ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు.. మోడీ క్యాస్టూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. దీనిపై బోలెడన్ని విమర్శలు మాత్రమే కాదు.. ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున మీమ్స్ వైరల్ అవుతుంటాయి.
మోడీని వ్యతిరేకించే వారందరూ ఆయన దుస్తుల గురించి తరచూ ప్రస్తావిస్తుంటారు. తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వార్డ్ రోబ్ లో ఎన్ని జతల దుస్తులు ఉన్నాయన్న విషయానికి సంబంధించిన అంశాన్ని తొలిసారి ఓపెన్ అయ్యారా? అంటే అవునని చెప్పాలి. ఎందుకుంటే.. తన దుస్తుల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి ఆయన ప్రస్తావిస్తూ సమాధానం ఇవ్వటమే దీనికి కారణం.
తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద ఆరోపణ తన దుస్తుల గురించేనన్న మోడీ.. ‘‘నాకు 250 జతల దుస్తులు ఉన్నాయని గతంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అమర్ సింగ్ చౌదరి ఆరోపించారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఆయన నా మీద ఆరోపణలు చేసిన రోజునే ఒక సభలో పాల్గొన్నా. రూ.250 కోట్లు దోచుకున్న సీఎం కావాలా? లేదంటే 250 దుస్తులు ఉన్న ముఖ్యమంత్రా? అని సభకు వచ్చిన వారిని ప్రశ్నించా. వారంతా 250 జతల దుస్తులు ఉన్నా ఫర్లేదు కానీ అవినీతిపరుడు వద్దని ముక్తకంఠంతో పేర్కొన్నారు. దాంతో ఇంకెప్పుడు విపక్షాలు నాపై అవినీతి ఆరోపణలు చేసే ధైర్యం చేయలేదు’’ అంటూ పేర్కొన్నారు. తాజాగా ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చెప్పకనే తన వార్డ్ రోబ్ లో 250 జతల దుస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారని చెబుతున్నారు.
ఇదే ఇంటర్వ్యూలో మరికొన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. అవేమంటే..
- బ్రాండ్ మోడీ అన్నది రెండు దశాబ్దాల ప్రజాజీవితంలో ప్రజల నుంచి సంపాదించుకున్న విశ్వాస ఫలితం. అంతే తప్పించి.. దాని కోసం నేనేమీ ప్రయత్నం చేయలేదు. నేను మనిషినే. తప్పిదాలు చేసి ఉండొచ్చు. కానీ.. తప్పుడు ఉద్దేశాలు మాత్రం నాకెప్పుడు లేవు.
- పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా.. పదేళ్లు దేశ ప్రధానమంత్రిగా పని చేసిన వ్యక్తి తల్లి తన చివరి రోజుల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిపిందంటే అలాంటి దేశానికి మరే ఇతర బ్రాండూ అవసరం లేదని నా అభిప్రాయం. అతను భిన్నమైన వ్యక్తి అని ఆ దేశం ఎప్పుడో అర్థం చేసుకుంది.
- మళ్లీ అధికారంలోకి రాగానే మేమేం చేయాలో దేశ యువతనే అడగదలుచుకున్నాం. అందుకోసం తొలి 100 రోజుల కార్యాచరణను 125రోజులకు పొడిగించాం. ఒకే దేశం.. ఒకే ఎన్నిక బీజేపీ మేనిఫెస్టో హామీలు. దాన్ని నెరవేర్చి తీరుతాం. జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం. నా శ్రేయస్సు రాజ్యాంగ శ్రేయస్సుతో ముడిపడి ఉంది. ఈ రోజున ఈ స్థానంలో ఉన్నానంటే రాజ్యాంగం వల్లే. నేను స్ఫూర్తి.. శక్తిని పొందేది రాజ్యాంగం నుంచే.
- మైనార్టీలకు వ్యతిరేకంగా నేనెప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. మైనార్టీలకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ప్రత్యేక పౌరుల హోదాను ఎప్పటికీ అంగీకరించలేను. ఎందుకంటే ప్రజలందరూ సమానమే. మైనార్టీ సంతులీకరణ కోసం కాంగ్రెస్.. విపక్షాలు చేస్తున్న ఓటుబ్యాంకు రాజకీయాలనే నా ఎన్నికల ప్రసంగాల్లో బయటపెడుతున్నానే తప్పించి.. మైనార్టీలకు నేను వ్యతిరేకం కాదు.
- కాంగ్రెస్ మేనిఫెస్టో నిండా ముస్లిం లీగ్ ఛాయలే. చివరకు టెండర్ల కేటాయింపు వాటిల్లోనూ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని అందులో హామీలు గుప్పించారు.
- రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక స్ఫూర్తికి నిత్యం గండి కొట్టే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సే. రిజర్వేషన్లకు మతం ప్రాతిపదిక కారాదని.. అంబేడ్కర్.. నెహ్రూతో సమా రాజ్యాంగ నిర్మాతలంతా తీసుకున్న నిర్ణయానికి తూట్లు పొడుస్తోంది.
- జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల్లో ఎన్డీయే కూటమి 400లకు పైగా స్థానాలు సాధించటం ఖాయం. ఉనికి పరంగానే కాదు భావజాల పరంగా కూడా బీజేపీ మాత్రమే దేశంలో సిసలైన జాతీయ పార్టీ. దేశమే ముందన్నది మా మూల సిద్ధాంతం.