5ఫేజ్ పోల్ కు రోజు ముందు మోడీ సంచలన హామీ
అంచనాలకు భిన్నంగా వ్యవహరించటం దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కొత్తేం కాదు
అంచనాలకు భిన్నంగా వ్యవహరించటం దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కొత్తేం కాదు. ఎన్నికల వేళ ఒక ఎజెండాతో బరిలోకి దిగటం.. దాన్ని ఎన్నికల మొదలు నుంచి పూర్తి అయ్యే వరకు ఫాలో కావటం పాత పద్దతిగా చెప్పాలి. తాజాగా జరుగుతన్న సార్వత్రిక ఎన్నికల తీరును చూస్తే.. మొత్తం ఏడు ఫేజ్ లలో కొన్ని ఫేజ్ ల వరకు ఒకలా.. మిగిలిన ఫేజ్ లో మరోలా వ్యవహరించే ధోరణికి శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ. తాజాగా ఆయన ఇచ్చిన సంచలన హామీ ఎవరిని లక్ష్యంగా చేసుకొని చేసినట్లు? అన్నది ప్రశ్నగా మారింది.
మొదటి నాలుగు ఫేజ్ లకు ఒకలా.. ఐదో ఫేజ్ నుంచి మరోలా వ్యవహరిస్తున్న ఆయన.. మిగిలిన రెండు ఫేజ్ ప్రచారంలో మరెన్ని కొత్త అంశాల్ని తెర మీదకు తీసుకొస్తారో చూడాలి. ఐదో దశ పోలింగ్ ఈ రోజు (సోమవారం) జరగనుంది. దీనికి ఒక రోజు ముందుగా పశ్చిమబెంగాల్ లోని పురులియాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ సంచలన హామీ ఇచ్చారు.
తాను దేశ ప్రజలకు మరో గ్యారెంటీ ఇవ్వనున్నట్లుగా చెప్పిన మోడీ.. ‘‘నేను ఇప్పుడు చెబుతున్నా. ఇకపై అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. దేశ ప్రజలకు మరో గ్యారెంటీ ఇస్తున్నా. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అనంతరం అవినీతిపరులు వారి పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని చూస్తుంటే.. ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామన్న ధీమాతో పాటు.. ఫలితాల తర్వాత చోటు చేసుకునే రాజకీయ పరిణామాలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా చెప్పాలి.
ఇంతకూ మోడీ టార్గెట్ ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే తన పదేళ్ల పాలనలో కేంద్ర విచారణ సంస్థలైన సీబీఐ.. ఐటీ.. ఈడీలను తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేసేందుకు వినియోగిస్తున్నట్లుగా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తాజా హామీ చూస్తే.. మోడీ పాలనలో సంచలన పరిణామాలు ఖాయమన్న మాట వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఎవరెవరు జైలుకు వెళతారన్నది ఒక లెక్క అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు జైలుకు వెళతారు? అన్నదిప్పుడు చర్చగా మారింది. రాజకీయ విభేదాలతో తమను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేస్తున్నట్లుగా మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తాజా వ్యాఖ్యలు ఈ వాదనకు మరింత బలోపేతం చేస్తాయంటున్నారు. ఏమైనా.. సంచలన పరిణామాలు కొత్త ప్రభుత్వంలో చోటు చేసుకోవటం ఖాయమని చెప్పక తప్పదు.