మోడీ 3.0 పాల‌న‌: ఆర్థికం.. మంద‌గ‌మ‌న‌మే.. నిరుద్యోగ‌మూ అంతే..!

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గమనిస్తే ఆర్థిక మందగమనం స్పష్టంగా కనిపిస్తుంది.

Update: 2024-07-27 02:45 GMT

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గమనిస్తే ఆర్థిక మందగమనం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం 48 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా రాష్ట్రాలకు ఇచ్చింది రూపాయి కూడా కనిపించట్లేదు. ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపించంది. ఒక బీహార్ కి మాత్రమే బడ్జెట్ నుంచి కేటాయింపులు జరిపింది. ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం అప్పుల రూపంలో 15 వేల కోట్ల రూపాయలు ఇప్పిస్తానని మాత్రమే చెప్పింది.

సరే, అసలు దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? అనేది గమనిస్తే.. ప్రస్తుతం ఆర్థిక మంద‌గ‌మ‌నంలో దేశం నడుస్తోంద‌ని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు రోజు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో సమర్పించారు. దీనిని గమనిస్తే.. దేశంలో నిరుద్యోగం తీవ్రత ఎక్కువగా ఉందని ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని స్పష్టం చేస్తోంది. ఇది గడిచిన 10 సంవత్సరాల కాలానికి ఇచ్చిన ఆర్థిక సర్వే. వాస్తవానికి ఆర్థిక సర్వే ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దేశంలో నిరుద్యోగం అదేవిధంగా సామాన్యుల చేతిలో డబ్బులు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఒకవైపు ఉద్యోగాల కలపనలో తాము ముందున్నామని మోడీ చెప్తున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం దానికి చాలా భిన్నంగా ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిరుద్యోగం విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకొని ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తుందని అందరూ ఆశించారు. కానీ బడ్జెట్ అలా కనిపించిన ప‌రిస్థితి లేదు. వాస్తవం పరిశీలిస్తే మాత్రం రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఇదే సమయంలో 500 టాప్‌ కంపెనీల్లో కోటి మంది నిరుద్యోగులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి శిక్షణ ఇప్పిస్తామని ప్రకటించారు. ఇది ఎంత‌వ‌ర‌కు సాధ్యమయ్యే పని అనేది గమనిస్తే సాధ్యం కాదనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే దేశంలో టాప్ 500 కంపెనీలు శిక్షణ తీసుకోవాలంటే ఉన్నత స్థాయి చదువు కచ్చితంగా అవసరం. ఆ స్థాయిలో గ్రామీణ యువత లేకపోవడం, ఉన్నా.. వారికి అవకాశాలు దక్కుతాయా అనేది ప్రధాన సమస్యగా మారింది.

ఒకవేళ ప్రభుత్వం చెబుతున్నట్టుగా కోటి మందికి ఐదు సంవత్సరాలు టాప్ 500 కంపెనీల్లో శిక్షణ ఇచ్చి బయటకు తీసుకు వచ్చినా.. తదుపరి వారి భవిష్యత్తు ఏమిటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ శిక్షణ ఇవ్వడం ఒకటే కాదు, శిక్షణ తర్వాత వారికి ఉపాధి చూపించాలి. ఉద్యోగాలు చూపించాలి. ఈ విషయాన్ని తీసుకున్నప్పుడు బడ్జెట్లో అటువంటి ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. పైగా `ముద్రా` రుణాలను పెంచడం ద్వారా మరింతగా ప్రజలు అప్పులు తీసుకుని ఉపాధి కల్పించుకునే దిశగా న‌డిపిస్తున్నట్లు కనిపిస్తుంది.

ఒకప్పుడు ప్రభుత్వమే కొన్ని రంగాలను స్థాపించి వాటిలో ఉపాధి కల్పన దిశగా అడుగులు వేసింది. ఇలా వచ్చిందే `గ్రామీణ ఉపాధి హామీ` పథకం. దీనివల్ల దేశవ్యాప్తంగా నిరక్షరాస్యులు అయిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు. చ‌దువుకున్న నిరుద్యోగులను కూడా ఇలాంటి పథకాలతో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని మోడీ ప్రభుత్వం వదిలేసింది. పూర్తిస్థాయిలో నిరుద్యోగాన్ని రూపుమాపే చర్యలకు మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఇలా చేయ‌న‌ప్పుడు దేశ‌ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా మెరుగుపడుతుం ది అనేది ప్ర‌శ్న‌.

దేశ‌ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే ప్రజల చేతిలో డబ్బు ఉండాలి. తద్వారా మాత్రమే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోగా పన్నుల రూపంలో వారి నుంచి ఎడాపెడా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి మెరుగు పడకపోగా మరింత దిగజారి పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా నిత్య అవసరాల ధ‌ర‌ల‌ను ప్రస్తావించలేదు. అదేవిధంగా రైతుల విషయాన్ని పరిశీలిస్తే రైతులకు భారీ ఎత్తున మద్దతు ధరలు ప్రకటించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు.

కానీ మరోవైపు రైతులు వాడే ఎరువులు, పురుగుమందులు గమనిస్తే వీటి మీద భారీగా సెస్సులు పెంచారు. తద్వారా రైతులకు భారం పెరుగుతుంది. ఇది అంతిమంగా నిత్య‌వస‌రాల ధ‌ర‌ల‌ను పెంచుతుంది. ముఖ్యంగా అమ్మోనీయా, నైట్రేట్ ఉత్పత్తులకు సంబంధించి ధ‌ర‌లు పెంచారు. త‌ద్వారా రైతులకు ఎరువులు పురుగుమందులు రూపంలో మ‌రింత భారం ప‌డ‌నుంది. ఇది కూడా రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాల విషయంలో మోడీ సర్కారు వెనక్కి తగ్గి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Tags:    

Similar News