నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. కాంగ్రెస్ రియాక్షన్ ఇదే!
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి 2014లో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి ఈడీ అప్పట నుంచి దీన్ని దర్యాప్తు చేస్తోంది.
మరో రెండు రోజుల్లో రాజస్థాన్ లోనూ, వారం రోజుల్లో తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో... నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... ఈ కేసులో ఆర్ధిక అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ.751.9 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. దీంతో ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి 2014లో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి ఈడీ అప్పట నుంచి దీన్ని దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని తోపాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్ లని గతంలోనే విచారించి వారి స్టేట్ మెంట్స్ ని రికార్డ్ చేసింది.
ఈ క్రమంలో తాజాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ తోపాటు దాన్ని నిర్వహిస్తోన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. ఈడీ దర్యాప్తులు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఢిల్లీ, ముంబయి, లఖ్ నవూ నగరాల్లో రూ.661.69 కోట్ల ఆస్తులను కలిగి ఉండగా... అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ లో ఈక్విటీ షేర్ల రూపంలో యంగ్ ఇండియన్ రూ.90.21కోట్లు కలిగి ఉందని తెలినట్లు చెబుతున్నారు!
కాగా... నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురణకర్తగా ఉన్న సంగతి తెలిసిందే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థగా ఉంది. ఆ నేపథ్యంలో... యంగ్ ఇండియన్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
కాంగ్రెస్ కు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు కుట్ర పన్నినట్లు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2013లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇందులో మనీలాండరింగ్ కు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి ఈడీ 2014 నుంచి దీన్ని దర్యాప్తు చేస్తోంది.
ఇదిలావుంటే ఈడీ చర్యపై కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు. ఇందులో భాగంగా... ఎజెఎల్ (అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్) ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు వార్తలు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో ఓటమి నుండి దృష్టిని మరల్చడానికేనని మండిపడ్డారు. మరోపక్క... కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.