జాతీయ నేతలు తెలంగాణలో పోటీకి దిగితే.. 43 ఏళ్ల తర్వాత ఓ రికార్డు

తెలంగాణ నుంచి పోటీ చేయాలని తాజాగా టి-కాంగ్రెస్ నేతలు తమ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కోరారు. లేదంటే ప్రియాంక గాంధీనైనా బరిలో దింపాలని కోరుతున్నారు.

Update: 2023-12-20 01:30 GMT

లోక్ సభ ఎన్నికలకు మరెంతో దూరం లేదు.. నాలుగు నుంచి ఐదు నెలలే సమయం.. ఓవైపు హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ.. పదేళ్లుగా కేంద్రంలో దూరమైన అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్.. తీవ్రంగా ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు. మోదీ ఇప్పటికే హ్యాట్రిక్ పై మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ 'ఇండియా' కూటమిని పట్టాలెక్కించే పనిలో ఉంది. జనవరి నుంచి రాజకీయం మరింత ఊపెక్కడం ఖాయం.

తెలంగాణ.. పొలిటికల్ బ్యాటిల్

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ నెగ్గగలిగింది. ఈ రాష్ట్ర నాయకత్వం, పొరుగునున్న కర్ణాటక నాయకుల ప్రయత్నం, జాతీయ నాయకుల పట్టుదల, బీజేపీ-బీఆర్ఎస్ చేజేతులా చేసుకున్నది కొంత కలిసి కాంగ్రెస్ కు అధికారం దక్కింది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా.. రాజకీయ వేడి మాత్రం మరో రూపంలో రగులుతోంది. వాస్తవానికి ఈ రాష్ట్రంతో పాటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలు, ఛత్తీస్ గఢ్, మిజోరం వంటి చిన్న రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో ఇప్పటికే ఎన్నికల సెగ చల్లారింది. తెలంగాణలోనే ఇంకా ఇంకా రాజుకుంటోంది.

అప్పట్లో ఆమె..

ఎమర్జెన్సీ ముగిసిన అనంతరం జరిగిన 1978 ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ఇందిరాగాంధీ 1980 మధ్యంతర ఎన్నికల నాటికి పుంజుకొన్నారు. నాడు అనూహ్యంగా మెదక్ నుంచి పోటీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నా సొంత ప్రాంతమైన రాయ్‌బరేలీలో ఏడు వేల మెజార్టీనే తెచ్చుకున్నా, మెదక్ వాసులు మాత్రం నన్ను రెండు లక్షల మెజార్టీతో గెలిపించారు. ఇకపై వాళ్ల తరఫునే లోక్‌సభలో అడుగుపెడతా. రాయ్‌బరేలీ సీటు వదులుకుంటా" అని ప్రకటించారు. అప్పట్లో ఉత్తరాదిన జనతా పార్టీ ప్రభావం బాగా కనిపిస్తుండటంతో దక్షిణాదిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఇందిరతో పోటీ చేయించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి, ఇతర ముఖ్యనేతలు మెదక్ నుంచి పోటీ చేయాలని ఇందిరకు సూచించారు. చిత్రం ఏమంటే.. ఎస్.జైపాల్ రెడ్డి ఆ ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున నిలబడ్డారు. గణిత మేధావి, మానవ కంప్యూటర్‌ గా పేరున్న శకుంతలా దేవి స్వతంత్ర అభ్యర్థిగా మెదక్ నుంచే బరిలో దిగారు. ఇంకో విచిత్రం ఏమంటే.. పీవీ నరసింహారావు తనయుడు పీవీ రాజేశ్వరావు, తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు కేశవ్ రావు జాదవ్ తదితరులు కూడా ఇందిరపై పోటీకి దిగారు. ఇందిర ఏకంగా 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. ఆమెకు 3,01,577 ఓట్లు రాగా, జైపాల్ రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. కేశవ్‌రావుజాదవ్‌కు 26,149 ఓట్లు పడ్డాయి. శకుంతలాదేవి 6,514 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు.

మళ్లీ ఇప్పుడు..?

తెలంగాణ నుంచి పోటీ చేయాలని తాజాగా టి-కాంగ్రెస్ నేతలు తమ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కోరారు. లేదంటే ప్రియాంక గాంధీనైనా బరిలో దింపాలని కోరుతున్నారు. వీరిద్దరే కాక.. ప్రధాని మోదీ మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారని కథనాలు వస్తున్నాయి. దక్షిణాదిన పార్టీ పటిష్ఠానికి మోదీ ఇక్కడినుంచి లోక్ సభకు పోటీచేయాలనేది వాదనగా ఉంది. తెలంగాణలో వీరి ముగ్గురిలో ఏ ఒక్కరు పోటీ చేసినా అది సంచలనమే అవుతుంది. బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మరిచిపోయేందుకు లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందనడంలో సందేహం లేదు. చివరకు చెప్పేదేమంటే.. మోదీ, సోనియా, ప్రియాంకలో తెలంగాణ నుంచి ఎవరు పోటీకి దిగినా.. 43 ఏళ్ల తర్వాత ఓ జాతీయ అగ్ర నాయకత్వం ఇక్కడ బరిలో నిలిచినట్లు అవుతుంది.

మెదక్ ఎంపీగానే ఇందిర దుర్మరణం

ఇందిరా గాంధీ మెదక్ నుంచి గెలిచి ప్రధాన మంత్రిగా కొనసాగారు. అదే సమయంలో 1984లో దారుణ హత్యకు గురయ్యారు. అంటే.. ఆమె మెదక్ ఎంపీగానే దివంగతులయ్యారు. అలా దేశానికి ప్రధానిని అందించిన నియోజకవర్గంగా మెదక్ నిలిచిపోయింది. తెలంగాణ నుంచి ప్రధాని స్థాయి వ్యక్తి పోటీ చేయడం అదే చివరిసారి. 1992లో పీవీ నరసింహారావు ప్రధాని అయినా.. నంద్యాల నుంచి బరిలో నిలిచారు.

Tags:    

Similar News