భారత్ ను తెగ పొగిడేస్తున్న పాక్ మాజీ ప్రధాని!
అవును... దశాబ్దాలుగా ఎన్నడూలేని విధంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 8న పాకిస్థాన్ లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితి అత్యంత వేగంగా తిరోగమనం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో... విపక్షాలకు అది బలమైన అస్త్రంగా మారింది. ప్రస్తుతం పాక్ లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి చేరాయి. డాలర్ తో పాక్ రూపాయి మారకం విలువ మరింత దిగజారిపోతుంది. ఈ సమయంలో... పాక్ ఫ్యూచర్ పై ఆ దేశ మాజీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... దశాబ్దాలుగా ఎన్నడూలేని విధంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. అక్కడ ఒక గుడ్డు 35 - 40 రూపాయలు ఉండగా.. పెట్రోల్ లీటర్ రేటు 300 రూపాయలు దాటిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఇలా పాకిస్థాన్ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరింది. ఫలితంగా పాకిస్థానీ రూపాయి క్రమంగా దిగజారిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. పాక్ ఫ్యూచర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం నుంచి తేరుకోవడం.. పాక్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ఇదే సమయమో... పాకిస్థాన్ వెనకపడిందని.. దానిని పునర్నిర్మించాలని.. తాము అధికారంలోకి వస్తే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తామని.. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు.
తమ హయాంలో డాలర్ తో పాకిస్థానీ రూపాయి మారకం విలువను 104 వద్దే కట్టడి చేశామని గుర్తుచేశారు. 2018 ఎన్నికల్లో పాకిస్థాన్ ప్రజానికంపై బలవంతపు ప్రభుత్వాన్ని రుద్దారని.. అందువల్లే ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు.. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందంటూ పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పరోక్షంగా భారత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నవాజ్ షరీఫ్. ఈ సందర్భంగా చంద్రయాన్ - 3 ప్రస్థావనను పరోక్షంగా తీసుకొచ్చారు.
ఈ క్రమంలో.. పొరుగున ఉన్న దేశాలు చంద్రుడిపై కాలుమోపాయని చెప్పిన నవాజ్ షరీఫ్... పాకిస్థాన్ మాత్రం భూమి మీదే ఎదగలేకపోతోందని, నిలవలేకపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పాక్ ఆర్థిక కష్టాలకు పాకిస్థానే కారణం అని... ప్రస్తుత పాక్ పరిస్థితికి పక్కనున్న భారతదేశమో, అగ్రరాజ్యం అమెరికానో కారణం కాదని నొక్కి వక్కాణించారు!