విశాఖ పాలిటిక్స్: ఎవరి దారి వారిదేనా..!
ఉత్తరాంధ్ర జిల్లాలకు కీలకమైన ప్రాంతం విశాఖ. ఇక్కడ ఎలుగెత్తే పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది.
ఉత్తరాంధ్ర జిల్లాలకు కీలకమైన ప్రాంతం విశాఖ. ఇక్కడ ఎలుగెత్తే పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. ఉమ్మడి విశాఖపై పట్టు సాధించేందుకు దాదాపు అన్ని పార్టీలు ప్రయత్నాలుచేస్తాయి. పర్యావరణం, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్, వ్యవసాయం.. ఇలా ఏ రంగం తీసుకున్నా.. విశాఖకు మంచి పేరుంది. దీంతో ఇక్కడ పాగా వేసేందుకు పార్టీల మధ్య ప్రయత్నం లేకుండానే పోటీ ఉంటుంది. గతంలో టీడీపీ బలంగా ఇక్కడ ముందుకు సాగింది. తర్వాత.. వైసీపీ పుంజుకుంది.
ఇక, బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకున్న దరిమిలా.. ఇక్కడ కమల వికాసం కూడా కనిపించింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పుంజుకుంది. ఇలా నాలుగు పార్టీలూ.. విశాఖపై ప్రభావం చూపించాయి. అయితే.. కూటమి పార్టీల మధ్య కుమ్ములాటలకే విశాఖ ఇప్పుడు కేంద్రంగా మారింది. సాధారణంగా ఒక పార్టీ విజయం దక్కించుకున్నా.. కూటమి పార్టీల మధ్య సఖ్యత ఉంటుందని అందరూ ఆశిస్తారు. ఇదే పైస్థాయిలోనూ జరుగుతోంది. కానీ, ఆ తరహా రాజకీయాలు విశాఖలో కనిపించడం లేదు.
ఎవరికి వారే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. నేతల చేరికల నుంచి ప్రభుత్వ కార్యక్రమాల వరకు కూడా ఎవరూ కలిసి కట్టుగా ముందుకు సాగడం లేదన్నది వాస్తవం. ఇప్పటి వరకు జరిగిన ఏ కార్యక్రమంలోనూ నాయకులు కలిసి కట్టుగా పాల్గొన్న సందర్భం ఒక్కటి కూడా లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ఒకే పార్టీలో ఉన్న నాయకుల మధ్య కూడా సఖ్యత లేకపోవడం మరింత ఆశ్చర్యకరం. ఈ విషయంపై జనసేన, టీడీపీ, బీజేపీల్లోనూ చర్చ సాగుతోంది.
ఉదాహరణకు టీడీపీకి చెందిన గంటా శ్రీనివాసరావు.. సొంత నేతలతో ఏమాత్రం కలిసి పనిచేయడం లేదు. బీజేపీ నాయకుడు, ఎంపీ సీఎం రమేష్‌పై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ఇక, జనసేన నాయకులు కూడా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేకపోయినా.. భవిష్యత్తులో ప్రజలు ఆయా పార్టీలను ఆదరించడంలో గ్యాప్ ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందరూ కలిసి ఉంటే ఆ ఎఫెక్ట్ వేరే గా ఉంటుంది.
అది పార్టీ అయినా.. నాయకులైనా.. ప్రభుత్వమైనా..! కానీ, ఆదిశగా విశాఖ పాలిటిక్స్ ఏమాత్రం అడుగులు వేయలేక పోతున్నాయి. ఇప్పటికైనా ఆయా పార్టీల అధిష్టానాలు కలిసి కట్టుగా దీనిపై చర్చించి ముందుకు సాగితేనే మేలు జరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.