అక్కడ కూటమికి డెబ్బై... వైసీపీకి దెబ్బే మరి !?

ఏపీలో టీడీపీ కూటమి అధికారాన్ని వైసీపీ ఓటమికి డిసైడ్ చేసే అత్యంత కీలకమైన స్పాట్ ఒకటి ఉంది.

Update: 2024-05-30 03:47 GMT

ఏపీలో టీడీపీ కూటమి అధికారాన్ని వైసీపీ ఓటమికి డిసైడ్ చేసే అత్యంత కీలకమైన స్పాట్ ఒకటి ఉంది. అదే నూటొక్క జిల్లాల కోస్తా బెల్ట్. ఇది ఏకంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి దక్షిణ కోస్తాలోని గుంటూరు దాకా ఉంది. ఈ మొత్తం బెల్ట్ లో 101 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

ఇందులో ఉత్తరాంధ్రాలో 34 ఉంటే ఉభయ గోదావరి జిల్లాలలో మరో 34 సీట్లు ఉన్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాలలో కలుపుకుని మరో 33 సీట్లు ఉన్నాయి. ఇలా చూస్తే కనుక 101 అసెంబ్లీ సీట్లు అయ్యాయి. ఇందులో డెబ్బై సీట్లు కనుక కూటమికి వస్తే అధికారం వారిదే అని అంటున్నారు. ఆ స్పీడ్ ని ఆపడం వైసీపీ వల్ల కాదు అని అంటున్నారు.

అదెలా అంటే గతసారి కూడా అంటే 2014లో టీడీపీ కూటమికి ఇక్కడే మ్యాజిక్ ఫిగర్ 88కి దగ్గరగా సీట్లు దక్కాయి. దాంతో ఏ పేచీ పూచీ లేకుండా సీఎం సీటు టీడీపీ పరం అయింది. ఈసారి కూడా అదే మ్యాజిక్ జరుగుతుందని కూటమి బాగా నమ్మకం పెట్టుకుంది.

ఉత్తరాంధ్రాలో కనీసంగా ఇరవై సీట్లు గోదావరి జిల్లాలలో మరో పాతిక సీట్లు అలాగే క్రిష్ణా గుంటూరులలో పాతిక సీట్లు గెలుస్తామని టీడీపీ కూటమి ధీమాగా ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే వైసీపీకి 31 సీట్లు మాత్రమే మొత్తం కోస్తా బెల్ట్ లోని ఏడు జిల్లాలలో వస్తాయన్న మాట.

ఇక కోస్తాలో డెబ్బై సీట్లు గెలిస్తే టీడీపీ కూటమికి మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేయడానికి కేవలం 18 సీట్లు మాత్రమే తగ్గుతాయి. గ్రేటర్ రాయలసీమలోని ఆరు జిల్లాలలో ఉన్న 74 సీట్లలో కనీసంగా పాతిక సీట్ల నుంచి ముప్పయి సీట్లు గెలిచి తీరుతామని కూటమి స్ట్రాంగ్ హోప్స్ పెట్తుకుని ఉంది. దాంతో అధికారం పక్కా అని ధీమాతో ఉంది.

అదే సమయంలో టీడీపీ అంచనాలు ఫలించి అదే జరిగితే రాయలసీమలోని సీట్లు తగ్గి, నెల్లూరు ప్రకాశంలో తక్కువ నంబర్ గెలిస్తే వైసీపీ అధికారానికి దూరం అవుతుందని అంటున్నారు. 2014లో ఇదే రకమైన అనుభవాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అలా ఎప్పటికీ జరగదని, 2014 వేరు 2024 వేరు అని వైసీపీ నేతలు అంటున్నారు.

తమకు కోస్తా బెల్ట్ లో కచ్చితంగా 50 దాకా సీట్లు వస్తాయని, గ్రేటర్ రాయలసీమలో మరో యాభై సునాయాసంగా వస్తాయని ఈ టోటల్ నంబర్ తో ముందు ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ కూటమిని కోస్తాలో వైసీపీ ఎంతవరకూ నిలువరించింది అన్న దాని మీద రేపటి అధికారం ఎవరి చేతులలోకి వస్తుంది అన్నది నిర్ధారణ అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News