కూటమి ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ...నలుగుతున్న ఏపీ ఇమేజ్ !

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ స్థానంలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తెచ్చింది.

Update: 2024-07-31 04:04 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ స్థానంలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తెచ్చింది. భారీ బడ్జెట్ తో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ని తెస్తున్నారు. ఆన్ లైన్ లో మంత్రుల నుంచి ఆమోదముద్ర వేయించుకుని ఈ ఆర్డినెన్స్ ని గవర్నర్ కి పంపుతున్నారు.

రానున్న నాలుగు నెలలకు అంటే నవంబర్ 30వ తేదీ వరకూ సరిపడా ఆర్ధిక మొత్తాలను ఇందులో కూర్చి ఆర్డినెన్స్ ని తెస్తున్నారు. మొత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లక్షా 30 వేల కోట్లలో ఉంది. గత వైసీపీ ప్రభుత్వం జోలై దాకా నాలుగు నెలల కోసం ఓటాను అకౌంట్ ని అసెంబ్లీ సమావేశాలు జరిపి గత మార్చిలో ఆమోదించింది.

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన ఎనిమిది నెలలకూ పూర్తి స్థాయి బడ్జెట్ ని తీసుకుని రావాల్సి ఉంది. అయితే ఆర్ధిక పరిస్థితి రాష్ట్రంలో ఏ మాత్రం బాగులేదని టీడీపీ కూటమి పెద్దలు చెబుతూ వస్తున్నారు. దాంతో ఈసారి బడ్జెట్ సెషన్ ని నిర్వహించినా బడ్జెట్ ని మాత్రం ఆమోదించలేదు.

దాంతో పాటు చూస్తే జూలై 31తో గత ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగుస్తోంది. దాంతో ఆగస్టు 1 నుంచి ఆర్ధిక లావాదేవీలు సాఫీగా సాగాలీ అంటే ఆర్డినెన్స్ తేవడం అనివార్యంగా మారింది. ఈ నేపధ్యంలో కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ ని తెస్తోంది.

ఇదిలా ఉంటే దేశంలో ఎక్కడా లేని దు సంప్రదాయానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తెర తీసిందని వైసీపీ విమర్శిస్తోంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు తేవడం ఏంటని నిలదీస్తోంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఓటాన్ అకౌంట్ తో ఎనిమిది నెలల పాటు ఆర్ధిక కార్యకలాపాలు జరిగిన చరిత్ర ఎక్కడా లేదని అంటోంది. చంద్రబాబు అనుభవం ఏమైందని ప్రశ్నిస్తోంది.

కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి హామీలు ఎగ్గొట్టడానికి టీడీపీ కూటమి పెద్దలు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నదే తప్ప రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ దిగజారిపోలేదని అంటోందీ. బాబు పాలనలో ఇదొక ఘోరమైన రికార్డు అని ఎద్దేవా చేస్తోంది.

అయితే ఇదంతా వైసీపీ చేసిన ఆర్ధిక విధ్వంసం వల్లనే అని టీడీపీ కూటమి పెద్దలు తిప్పి కొడుతున్నారు. ఏపీలో అలవి కాని అప్పులను చేసి మరీ సర్వనాశనం చేశారని దాని వల్లనే ఈ దుస్థితి అని అంటోంది. దీనికి వైసీపీ సిగ్గుపడాలి తప్ప తామెందుకు అని ఎదురు దాడి చేస్తోంది.

ఏది ఏమైనా ఏపీలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చూస్తే కనున రాష్ట్ర ఇమేజ్ దెబ్బ తిందనే అంటున్నారు. ఏపీ ఇన్నాళ్ళూ అప్పులు చేసినా అది ఎంతో కొంత గుట్టుగానే సాగింది అని రాష్ట్రం మేలు కోరుకునే వారు అంటున్నారు. ఇపుడు బడ్జెట్ సైతం ప్రవేశపెట్టలేని విధంగా ఆర్ధిక పరిస్థితి ఉందంటే రాష్ట్రానికే చేటు అని అంటున్నారు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగకుండా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News