తెలంగాణ కొత్త ఐటీ మంత్రి కేటీఆర్ ను దాటగలడా..!

ప్రస్తుతం అందరి దృష్టి ఐటీ (ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ) పై పడింది. గత ప్రభుత్వంలో ఈ శాఖను కేటీఆర్ నిర్వర్తించేవారు. దీనితో పాటు పంచాయతీ రాజ్ శాఖ కూడా ఆయన వద్దే ఉండేది.

Update: 2023-12-09 15:30 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధిత శాఖల మంత్రులతో పూర్తి స్థాయిలో కొలువు దీరింది. ఈ రోజు (డిసెంబర్ 09) నుంచి వారి వారి శాఖలకు సంబంధించి విధులు నిర్వర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శాసన సభ మొదటి సమావేశం కూడా ప్రారంభించింది. ముందుగా ప్రొటెం స్పీకర్, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం గవర్నర్ తమిళి సై ఆధ్వర్యంలో జరిగింది. డిసెంబర్ 7వ తేదీ సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించి కొందరు మంత్రుల పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఆ సందర్భంగా శాఖలను ప్రకటించలేదు. రెండు రోజుల కసరత్తు తర్వాత వారి వారి అర్హతలను బట్టి శాఖలను కేటాయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందరి దృష్టి ఐటీ (ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ) పై పడింది. గత ప్రభుత్వంలో ఈ శాఖను కేటీఆర్ నిర్వర్తించేవారు. దీనితో పాటు పంచాయతీ రాజ్ శాఖ కూడా ఆయన వద్దే ఉండేది. అయితే, ఈ సారి పంచాయతీ రాజ్ శాఖ సీతక్కను వెళ్లగా.. ఐటీ దుద్దిళ్ల శ్రీధర్ బాబును వరించింది. గత ప్రభుత్వంలో సీఎం తర్వాత కీలక వ్యక్తిగా.. దాదాపు సెకండ్ సీఎంగా ఆదరణ సంపాదించుకున్న కేటీఆర్ నిర్వర్తించిన శాఖను ఇప్పడు శ్రీధర్ బాబు నిర్వర్తిస్తుండడంతో ఆయన కూడా కాంగ్రెస్ లో అంత పెద్ద భారీ రోల్ ప్లే చేస్తారా? అన్న సందేహం చాలా మందిలో నెలకొంది. ఈ శాఖకు సంబంధించి కేటీఆర్ వర్సెస్ శ్రీధర్ బాబు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కేటీఆర్ గురించి బ్రీఫ్ గా..

కల్వకుంట్ల తారక రామారావు గురించి తెలంగాణతో పాటు దేశానికి కూడా పరిచయం అవసరం లేదు. కానీ ఆయన చదువు, రాజకీయ జీవితం గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం.. కేటీఆర్ సైన్స్ స్టూడెంట్. స్కూలింగ్ ముగిసిన తర్వాత బీఎస్సీ (సైన్స్) చదివారు. తర్వాత పూణే యూనివర్సిటీలో బయో టెక్నాలజీ (M.Sc), యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్స్ లోని బరూచ్ కాలేజ్ నుంచి మార్కెటింగ్ లో ఎంబీఏ అభ్యసించారు. ఆ తర్వాత ఒక కొంపెనీకి సీఈఓగా విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం, తెలంగాణ రావడం, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు దీరడం మొదటగా పంచాయతీ రాజ్ శాఖను నిర్వర్తించడం.. ఆ తర్వాత ఐటీ శాఖను కూడా నిర్వర్తించారు.

దుద్ధిళ్ల శ్రీధర్ బాబు

కేటీఆర్ తో పోల్చుకుంటే శ్రీధర్ బాబు ఏడేళ్లు పెద్ద. ఇంకా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1999 లో ఆయన తండ్రి శ్రీపాదరావు హత్య అనంతరం ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయవాద విద్యను అభ్యసించారు. మంచి స్పోక్ పర్సన్. సౌమ్యుడిగా.. ఉన్నతుడిగా.. గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీధర్ బాబు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకే పని చేస్తూ వస్తున్నారు. 2014లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, సమన్వయ కమిటీ సభ్యుడిగా పని చేశారు. ఆ తర్వాత మేనిఫేస్టో కమిటీ చైర్మన్ గా.. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, న్యాయ వాతావరణ మంత్రి, శాసన సభ వ్యవహారాలుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కూడా వివిధ శాఖలను పకడ్బంధీగా నడింపించారు.

కేటీఆర్ వర్సెస్ శ్రీధర్ బాబు గురించి చెప్పుకుంటే ఇద్దరు ఐటీ శాఖకు న్యాయం చేయగలరు. సుదీర్ఘ కాలం వివిధ శాఖలను నడిపిన శ్రీధర్ బాబు కేటీఆర్ కన్నా మరింత పటిష్టంగా ఐటీని నడుపుతారని తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఐటీ శాఖ కేటాయించడం సరైనదే అంటూ చర్చ మొదలైంది.

Tags:    

Similar News