ట్రంప్ దూల తీర్చేసిన కోర్టు.. 3 వేల కోట్లు ఫైన్‌!

అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

Update: 2024-02-17 07:06 GMT

అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ చేతిలో ట్రంప్‌ చిత్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధ్యక్షుడిని కావాలని ట్రంప్‌ ఆశపడుతున్నారు.

ఈ క్రమంలో ముందుగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడానికి జరుగుతున్న ప్రైమరీల ఎన్నికల్లో మిగిలినవారితో పోలిస్తే ట్రంప్‌ దూసుకుపోతున్నారు. ట్రంప్‌ తో పోటీ పడలేక భారత సంతత అభ్యర్థి, రిపబ్లికన్‌ పార్టీకే చెందిన వివేక్‌ రామస్వామి తప్పుకున్నారు. నిక్కీ హేలీ కూడా ఇదే బాటలో ఉన్నారు.

కాగా అమెరికా అధ్యక్షుడిని అవ్వాలని అనుకుంటున్న ట్రంప్‌ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో అక్రమాలకు తోడు, ఇతర వ్యవహారాల్లో ఇప్పటికే పలు కేసుల్లో ఆయన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ఇప్పటికే ఆయనకు జైలుశిక్ష, భారీ జరిమానాలు కూడా పడ్డాయి. ఇటీవల లైంగిక వేధింపులకు సంబంధించిన పరువునష్టం కేసులో అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ కు 83.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.692.4 కోట్లు) అదనంగా చెల్లించాలని మాన్‌ హటన్‌ ఫెడరల్‌ కోర్టు ఆదేశించిన సంగతి లె లిసిందే. ఇదే కేసులో అంతకుముందు ఆయనకు 5 మిలియన్‌ డాలర్ల జరిమానా పడింది. వీటిపైన ఆయన ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలు దాఖలు చేశారు.

ఈ క్రమంలో డోనాల్డ్‌ ట్రంప్‌ కు తాజాగా న్యూయార్క్‌ కోర్టులో గట్టి షాక్‌ తగిలింది. పలు బ్యాంకులను మోసం చేసిన కేసులో 364 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3 వేల కోట్లకు పైమాటే) జరిమానా విధించింది. దీంతో ట్రంప్‌ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

ట్రంప్‌ తన ఆస్తుల మొత్తాన్ని అసలు విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారని ఆయనపై అభియోగాలు వచ్చాయి. ఇలా మోసపూరితంగా కొన్నేళ్లపాటు బ్యాంకుల నుంచి వ్యాపార రుణాలు, ఇన్సూరెన్స్‌ పొందారనే అభియోగాలపై తాజా కేసు నమోదైంది.

డోనాల్డ్‌ ట్రంప్‌ పై న్యూయార్క్‌ అటార్నీ జనరల్, డెమోక్రటిక్‌ పార్టీ నేత లెటిటియా జేమ్స్‌ ఈ పిటిషన్‌ వేశారు. దీనిపై ఇటీవల రెండున్నర నెలల పాటు కోర్టు విచారణ నిర్వహించింది. ఈ క్రమంలో ట్రంప్‌ పై అభియోగాలు నిజమేనని కోర్టు నిర్ధారించింది. దీంతో ఆయనకు 364 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

ట్రంప్‌ కు కేవలం జరిమానానే కాకుండా మూడేళ్ల పాటు న్యూయార్క్‌ కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన ఆఫీసర్‌ లేదా డైరెక్టర్‌ గా ఉండకూడదంటూ కోర్టు నిషేధం విధించింది.

అయితే న్యూయార్క్‌ కోర్టు ఒక విషయంలో ట్రంప్‌ కు ఊరటనిచ్చింది. ఇది సివిల్‌ కేసు కావడంతో ఆయనకు జైలుశిక్ష వేయట్లేదని తెలిపింది. కాగా ఈ తీర్పుపై కూడా తాము ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేస్తామని ట్రంప్‌ న్యాయవాదులు తెలిపారు.

Tags:    

Similar News