హాట్ టాపిక్.. రాజీనామా చేసిన వాలంటీర్ల పైనా నిమ్మగడ్డ ఫిర్యాదు!
ఎన్నికల వేళ ఏపీలో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల వేళ ఏపీలో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాలంటీర్ల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతుందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుమీద నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వాలంటీర్లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా... ఏపీలో వృద్ధులకు, వికలాంగులకు ఈ నెల పెన్షన్ తీసుకోవడంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది తెలిసిందే. ఈ సమయంలో ఆయన మరో ఫిర్యాదు చేశారు!
అవును... ఏపీ వాలంటీర్ల పైన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మరో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే... ఈ సంస్థ ఫిర్యాదు కారణంగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పించడం.. ఫలితంగా ఈ నిర్ణయం రాజకీయంగా పెను దుమారానికి కారణమవ్వడం తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా రాజీనామా చేసిన వాలంటీర్ల పైన కూడా సంస్థ ప్రతినిది నిమ్మగడ్డ రమేష్.. ఎన్నికల సంఘం పరిశీలకులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీయబోతోందనేది ఆసక్తిగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... ఏపీలో వాలంటీర్ల చుట్టూ ఎన్నికల రాజకీయం తిరుగుతోందన్నట్లుగా పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... వాలంటీర్లు రాజీనామా చేసినా కూడా ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రామమోహన్ మిశ్రాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఎల్వీ సుబ్రహ్మణ్యం కోరారు.
ఇందులో భాగంగా... వాలంటీర్లు రాజీనామాలు చేసినా కూడా పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు చెప్పుకొచ్చారని తెలుస్తోంది! దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది! రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా నిమ్మగడ్డ వదలడం లేదనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. మరోపక్క ఇదంతా చంద్రబాబు తెర వెనుక ఉండి ఆడిస్తున్న డ్రామా అంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు!
మరోపక్క ప్రభుత్వ సలహాదారులపైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నందున ప్రభుత్వ సలహాదారులు కూడా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని ఆయన స్పష్టంచేశారు. ఇదే సమయంలో... జీతాలు తీసుకుంటున్నవారు ఎన్నికల సమయంలో రాజకీయ చర్చల్లో పాల్గొనకూడదని వెల్లడించారు. ఏ ఉద్యోగి అయినా అలా చేస్తే విధుల నుంచి సస్పెండ్ చేస్తారని పేర్కొన్నారు.