ప్రధాని అయ్యే ఛాన్స్ వద్దన్నారట.. గడ్కరీ సంచలనం
తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వచ్చినా.. తాను వద్దని చెప్పినట్లుగా చెప్పి సంచలనంగా మారారు.
క్లీన్ చిట్ రాజకీయాలు చేసే బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరన్న ఇమేజ్ తో పాటు.. మిగిలిన వారి మాదిరి నోటికి ప్లాస్టరర్ వేసుకొని తిరిగేలా కాకుండా.. తన మనసుకు తోచిన మాటను చెప్పే విషయంలో ఎలాంటి మొహమాటానికి గురి కాకుండా ఉండే అతి కొద్ది మందిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒకరు. ఆయన నోటి నుంచి ఆసక్తికర విషయాలు అనూహ్యంగా బయటకు వస్తుంటాయి. తాజాగా ఆ కోవలోనే ఒక ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వచ్చినా.. తాను వద్దని చెప్పినట్లుగా చెప్పి సంచలనంగా మారారు.
నాగపూర్ లో నిర్వహించిన జర్నలిజం అవార్డుల వేడుకలో పాల్గొన్న ఆయన.. ఒకసారి ఒక నేత తన వద్దకు వచ్చారని.. తాను ప్రధాని రేసులో నిలిస్తే తామంతా మద్దతు పలుకుతామని తనతో చెప్పారన్నారు. కానీ.. తనకు ప్రధానమంత్రి కావటం లక్ష్యం కాదన్నారు. తాను అనుకున్న దానికే కట్టుబడి ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సదరు వ్యక్తితో కరాఖండీగా చెప్పేశానని చెప్పారు.
తాను ఇప్పటివరకు ఈ విషయాన్ని ఏ నేతతోనూ ఇప్పటివరకు ఈ విషయాన్ని చెప్పలేదన్నగడ్కరీ.. తన తాజా మాటతో సంచలనంగా మారారు. ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఎప్పుడు వచ్చింది? ఆఫర్ చేసిన వ్యక్తి ఎవరు? లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నరేంద్ర మోడీ మినహా మరే నేత పేరు తెర మీదకు రాని వేళలో..గడ్కరీని పీఎం పోస్టు కోసం అడిగిన పెద్ద మనిషి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.