సీన్ లోకి నితిన్ గడ్కరీ...టీడీపీలో కొత్త రాగం !

బీజేపీ అయితే సొంతంగా 370 అంటూ బిగ్ నంబర్ నే వేసుకుని కూర్చుంది.

Update: 2024-05-29 23:30 GMT

కేంద్రంలో ఏ పార్టీకి కానీ కూటమికి కానీ ఫుల్ మెజారిటీ రాదు అని సర్వేలు అన్నీ ఘంటాపధంగా చెబుతున్నాయి. అయితే ఎన్డీయే కూటమి మేమే మళ్ళీ వస్తామని అంటోంది. అలాగే ఇండియా కూటమి తీరు కూడా అలాగే ఉంది. బీజేపీ అయితే సొంతంగా 370 అంటూ బిగ్ నంబర్ నే వేసుకుని కూర్చుంది. ఎన్డీయేకు 400 ఎంపీలు ఎందుకు రావు అని ప్రశ్నిస్తోంది.

అయితే గ్రౌండ్ రియాలిటీ అన్నది ఒకటి ఉంది. అది చూస్తే కనుక బీజేపీకి ఈసారి వచ్చే సీట్లు బాగా తగ్గుతాయని అంటున్నారు. మరి అటువంటి పరిణామమే సంభవించి మ్యాజిక్ ఫిగర్ కి దూరంగా జరిగితే ఎన్డీయే మిత్రులది కీలక పాత్ర అవుతుంది. ఎన్డీయే మిత్రులు అంతా ప్రధానిగా ఎవరిని అంగీకరిస్తే వారే బీజేపీ నుంచి వస్తారు.

ఇదే సూత్రం ఇండియా కూటమికి కూడా వర్తించబట్టే రాహుల్ కానీ కాంగ్రెస్ కానీ మిత్రుల మద్దతు కోసం చూస్తున్నారు. ఇక మోడీ అయినా అమిత్ షా అయినా పూర్తి మెజారిటీ సాధిస్తే బీజేపీలో ఎవరూ కిక్కురుమనే ప్రసక్తి ఉండదు. కానీ అలా కాకుండా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని సాధించలేక చతికిలపడితే మాత్రం అపుడు నితిన్ గడ్కరీ సీన్ లోకి వస్తారు అని అంటున్నారు.

నాగపూర్ కి చెందిన గడ్కరీ ఫక్తు ఆరెస్సెస్ నాయకుడు. ఆయనకు ఆరెస్సెస్ ఆశీస్సులు నిండుగా మెండుగా ఉన్నాయి. అలా నితిన్ గడ్కరీని ప్రధాని చేసేందుకు ఆరెస్సెస్ కూడా పావులు కదుపుతుంది అని అంటున్నారు. ఆరెస్సెస్ అంటే మరో వాజ్ పేయ్ గా బీజేపీలో చెబుతారు.

ఆయనకు బీజేపీ పార్టీలోనే కాకుండా బయట కూడా రాజకీయాలకు అతీతంగా మద్దతు ఉంది. సౌమ్యుడిగా మేధావిగా సమర్థుడిగా ఆయనకు పేరు. అలాగే వాజ్ పేయ్ మాదిరిగా ఉదారవాదిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు అత్యధిక శాతం ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సంగతి తెలుసుకున్న టీడీపీ ప్రముఖులు ఇపుడు ఆయనకు టచ్ లోకి వెళ్లారు అని అంటున్నారు. ఇటీవల జరిగిన నితిన్ గడ్కరీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఏపీ టీడీపీ నుంచి పుంఖానుపుంఖాలుగా అభినందనలు వెళ్లాయని చెబుతున్నారు. అదే సమయంలో నితిన్ గడ్కరీకి చంద్రబాబు లోకేష్ కూడా ప్రత్యేకంగా గ్రీట్ చేసినట్లుగా ప్రచారం సాగుతొంది.

బీజేపీలో ప్రధాని అభ్యర్ధిగా రేసులో ముందున్న నితిన్ గడ్కరీని ప్రసన్నం చేసుకునే పనిలో టీడీపీ ఉందని అంటున్నారు. ఇక మోడీ అమిత్ షా టీడీపీతో దోస్తీలో ఉన్నా వారు జగన్ తోనూ మైత్రీని కొనసాగిస్తున్నారు అన్న అనుమానాలు అయితే టీడీపీ వర్గాలలో ఉన్నాయి.

ఏపీకి ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ పెద్దగా జగన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయకపోవడాన్ని కూడా ఉదహరిస్తున్నారు. దాంతో పొత్తులో ఉన్నా కూడా జగన్ కి ప్రయారిటీ ఇస్తే ఇక ఏమిటి లాభం అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే నితిన్ గడ్కరీని ప్రధానిగా చేసే విషయంలో ఆరెస్సెస్ కి టీడీపీ కూడా సహకరించవచ్చు అన్న చర్చ కూడా ఉంది.

గతంలో కూడా దేశ ప్రధానుల ఎంపికలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు మరోసారి కేంద్రంలో చురుకైన పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. హంగ్ వస్తే మాత్రం బాబు చక్రం ఢిల్లీలో తిరుగుతుందని అంటున్నారు. మోడీ షాలు కాకుండా గడ్కరీ ప్రధాని అయ్యేలా కూడా టీడీపీ వర్క్ చేయడం ఖాయమని అంటున్నారు.

ఇక్కడ మరో మాట కూడా ఉంది. బీజేపీని టీడీపీతో పొత్తులోకి తీసుకుని రావడం వెనక నితిన్ గడ్కరీ కీలకమైన పాత్ర పోషించారు అని అంటున్నారు. ఆయనతో పాటు ఆరెస్సెస్ కూడా ఉంది అని చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే బీజేపీలో కొత్త ముఖం కనిపించే రోజు దగ్గరలో ఉందా ముందస్తుగానే నితిన్ గడ్కరీ టీడీపీని మిత్రుడిగా చేసుకున్నారా అన్న ప్రశ్నలు ఉదయించక మానవు. ఏది ఏమైనా ఒక్కటే చెప్పుకోవాలి. బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తేనే మోడీ అమిత్ షా మాట శాసనంగా పనిచేస్తుందని అంటున్నారు. మెజారిటీ రాకపోతే మాత్రం బీజేపీలోనే సమూల మార్పులు జరగడం ఖాయమని చెబుతున్నారు.

Tags:    

Similar News