.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ప్రత్యేక హోదా అస్త్రం తీసిన నితీష్...మోడీకి ఇరకాటమే ?

జూన్ 9న కేంద్ర ప్రభుత్వం ప్రమాణం చేసింది. ఇంకా నెల రోజులు కూడా కాలేదు కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ ని పెట్టారు.

Update: 2024-06-29 11:21 GMT

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు ఊత కర్రల మీద నిలబడింది. మెజారిటీ సొంతంగా రాని పరిస్థితుల్లో ఒక వైపు బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ పార్టీ సహకారంతో మరో వైపు ఏపీలోని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అండతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అయింది.

జూన్ 9న కేంద్ర ప్రభుత్వం ప్రమాణం చేసింది. ఇంకా నెల రోజులు కూడా కాలేదు కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ ని పెట్టారు. ఇది తీర్చాల్సిందే అని ఆయన కోరారు. ఒక విధంగా అల్టిమేటం లాంటిదే అని కూడా అనుకోవచ్చు.

బీహార్ లో ప్రత్యేక హోదా డిమాండ్ చాలా కాలంగా ఉంది వెనుకబడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరం అని అక్కడి రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇన్నాళ్ళు అది వట్టి డిమాండ్ గానే ఉండిపోయింది. ఇపుడు కేంద్రంలో తమ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఇంతకంటే మించిన తరుణం వేరొకటి ఉండబోదు అని భావించే నితీష్ అతి పెద్ద మెలిక పెట్టేశారు అని అంటున్నారు.

తాజాగా జరిగిన ఆ పార్టీ జాతీయ సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టి ఆమోదించారు. బీహార్ కి ప్రత్యేక హోదా అయినా ఇవ్వాలి లేదా ఆర్ధిక ప్యాకేజీ అయినా ఇవ్వాలని కోరుతూ తీర్మానించారు. అయితే దీని కంటే ముందు గత ఏడాది నవంబర్ లోనే అప్పటి రాష్ట్ర మంత్రివర్గం బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానిస్తూ ఆమోదం కూడా తెలిపింది.

Read more!

ఆనాటికి చూస్తే నితీష్ ఆర్జేడీ కాంగ్రెస్ తో కలసిన సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఎన్డీయే మిత్రుడుగా కాదు కేంద్ర ప్రభుత్వానికి కీలక భాగస్వామిగా ఉన్నారు. దాంతో పార్టీ ఈ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తోంది అని అంటున్నారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో 12 మంది జేడీయూ సభ్యులు ఉన్నారు. ఎన్డీయేలో జేడీయూ మూడవ అతి పెద్ద పార్టీగా ఉంది. దాంతో పాటు ఎన్డీయేకు కేంద్రంలో బొటా బొటీ మెజారిటీ ఉంది. నితీష్ కుమార్ ఈ మ్యాజిక్ ఫిగర్ ని చూసి తమ అవసరాన్ని గుర్తు పెట్టుకుని మరీ కేంద్రాన్ని ఈ మేరకు డిమాండ్ చేయగలుగుతున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే బీహార్ కి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్ చాలా పాతది అని జేడీయూ సీనియర్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని వారు అంటున్నారు. అయితే ప్రత్యేక హోదాకు కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకంగా ఉంది. అది కాస్తా బయటకు తీస్తే తేనే తుట్టెను కదల్చినట్లే అని భావిస్తోంది.

ఇప్పటికే బీహార్ తో పాటు ఒడిశా కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఉమ్మడి ఏపీని విభజించిన నేపధ్యంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ సారధి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. అయిదేళ్లు కాదు పదేళ్ళు ఇవ్వాలని బీజేపీ నాడు కోరింది. ఇక బీజేపీ కూడా 2014 ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీలో చెప్పింది.

అయితే కాలక్రమంలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించింది కానీ ఏపీలో ఈ రోజుకీ ప్రత్యేక హోదా ఆకాంక్షలు అయితే ప్రజలలో ఉన్నాయని అంటున్నారు. ఇపుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏపీలోని టీడీపీ మద్దతుతోనే ఏర్పాటు అయింది కాబట్టి ఇదే హోదాను సాకారం చేసుకునే సమయం అని అంటున్నారు. నితీష్ కుమార్ ఎలాంటి సంకోచం లేకుండా ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టారు. దాంతో చంద్రబాబు కూడా పెట్టాల్సిందే అని అంటున్నారు.

మొత్తానికి నితీష్ కేంద్రం మీద ఒత్తిడి తెస్తే ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడుతుంది. ఇలా రెండు కీలక భాగస్వామ్య పార్టీలు ప్రత్యేక హోదా కోరితే మోడీ ప్రభుత్వం ఏమి చేస్తుంది అన్నది ఒక చర్చగా ఉంది. మోడీ సర్కార్ కి ఇది కచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితి అని అంటున్నారు హోదా కాకపోతే ప్యాకేజీ అయినా ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అది ఇవ్వాలన్నా కేంద్రం ఉదారంగా ముందుకు రావాలి

ఈ రెండు రాష్ట్రాల విషయంలోనే కేంద్రం చర్యలు తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే విధంగా డిమాండ్ చేస్తాయి. మొత్తానికి మోడీ సర్కార్ కి నెల రోజుల హానీమూన్ టైం కూడా లేకుండా నితీష్ గట్టి డిమాండే పెట్టారని అంటున్నారు.

Tags:    

Similar News