నితీష్ ఎఫెక్ట్‌: మోడీకి అంత తేలిక‌కాదు.. విష‌యం ఏంటంటే!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు వ‌చ్చే ఐదేళ్ల పాటు ప్ర‌శాంతంగా ముందుకు సాగుతుందా? ఎలాంటి పొర‌పొచ్చాలు లేకుండా

Update: 2024-07-25 00:30 GMT

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు వ‌చ్చే ఐదేళ్ల పాటు ప్ర‌శాంతంగా ముందుకు సాగుతుందా? ఎలాంటి పొర‌పొచ్చాలు లేకుండా.. 2029 వ‌ర‌కు పాల‌న సాగిస్తుందా? అంటే.. చెప్ప‌డం క‌ష్టంగా మారింది. దీనికి కార‌ణం.. మిత్ర‌ప‌క్షాల్లో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్న జేడీయూ అధినేత‌, బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ వైఖ‌రే. తాజాగా కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత‌.. బిహార్‌కు సాధ్య‌మైన‌న్ని కేటాయింపులు చేశారు. `పూర్వోద‌య‌` పేరిట ఆ రాష్ట్రంలో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌ను పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు.

అయిన‌ప్ప‌టికీ.. ఏపీ మాదిరిగా స‌ర్దుకుపోయే గుణం.. స‌ర్దుకుపోయే రాజ‌కీయం బిహార్‌లో క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ ఎన్నిక‌లు జేడీయూ కు అత్యంత కీల‌కం. ముఖ్యంగా నితీష్ కుమార్ రాజ‌కీయాల‌కు ఈ ఎన్నిక‌ల‌కు ప్రాణ‌ప్ర‌దంగా మారాయి. అందుకే.. ఎప్ప‌టి నుంచో ఉన్న ప్ర‌ధాన డిమాండ్ ప్ర‌త్యేక హోదాను ఆయ‌న ఇటీవ‌ల తెర‌మీదికి మ‌రోసారి తెచ్చారు.

అంతేకాదు.. ఇప్పుడు కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న‌ది మ‌న‌మే కాబ‌ట్టి.. త‌ప్ప‌కుండా తీసుకువ‌స్తాన‌ని కూడా నితీష్ చెప్పారు. బ‌డ్జెట్ స‌మావేశాల‌కు నాలుగు రోజుల ముందే.. హ‌డావుడిగా అసెంబ్లీని కొలువు దీర్చి మ‌రీ.. ప్ర‌త్యేక హోదాపై తీర్మానం చేశారు. దీనిని పార్ల‌మెంటుకు కూడా పంపించారు. కానీ, మోడీ స‌ర్కారు చాలా తెలివిగా ఎవ‌రికీ ఇవ్వ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ముగిసిన క‌థ‌గా కూడా చెప్పేసింది. ఈ నేప‌థ్యంలోనే నితీష్‌ను మ‌చ్చిక చేసుకునేందుకు నేరుగా బ‌డ్జెట్ కేటాయింపులు చేసింది(ఏపీకి ఇలా చేయ‌లేదు).

అయినప్ప‌టికీ.. నితీష్ సంతోషంగా అయితే లేరు. రాష్ట్రంలో ప్ర‌ధాన విప‌క్షంగా బ‌లంగా ఉన్న ఆర్జేడీ.. నితీష్‌కు సెగ పెట్ట‌డం ప్రారంభించింది. ఊరూవాడా.. నితీష్‌కు వ్య‌తిరేకంగా బుధ‌వారం పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. ప్ర‌త్యేక హోదా సాధించ‌లేక‌పోయార‌ని..త‌క్ష‌ణం రాజీనామా చేయాల‌ని కూడా.. ఆర్జేడీ నాయ‌కుల నుంచి సెగ త‌గులుతోంది. ఈ క్ర‌మంలో నితీష్ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ``ముందు.. ముందు మీరే చూస్తారుగా!`` అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంటే.. దీన‌ర్థం.. మోడీని ఆయ‌న ఊరుకునేది లేద‌న్న సంకేతాల‌ను పంపిస్త‌న్న‌ట్టు అయింది. పైగా.. నిల‌క‌డ లేని రాజ‌కీయాలు చేసే నాయ‌కుడిగా... పొత్తు ధ‌ర్మం పాటించ‌ని నాయ‌కుడిగా కూడా నితీష్ పేరు తెచ్చుకున్న నేప‌థ్యంలో ఆయ‌న వ్య‌వ‌హారం ఎప్పుడు ఎటైనా మారే ఛాన్స్ ఉంది. సో.. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణాల‌ను గ‌మ‌నిస్తే.. ఏ క్ష‌ణంలో అయినా.. నితీష్ యూట‌ర్న్ తీసుకునే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ ఆయ‌న‌కు కావాల్సింది.. కేంద్రంలో మోడీ ఉండ‌డం కాదు.. బీహార్‌లో త‌ను నిల‌దొక్కుకోవ‌డం.

అందుకే కాంగ్రెస్‌ను కూడా కాద‌ని మోడీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. త‌న ఆలోచ‌న‌లో తేడా కొడుతోంద‌ని.. లేదా.. త‌న కాళ్ల‌కింద‌కు నీళ్లు వ‌స్తున్నాయ‌ని ఏమాత్రం ఆయ‌న గుర్తించిన‌.. వెంట‌నే మారిపోవ‌డం ఖాయం. గ‌తంలోనూ బీజేపీతో రెండు సార్లు పొత్తు పెట్టుకుని వ‌దిలేశారు. ఇది మూడోసారి. కాబ‌ట్టి.. నితీష్ ఎఫెక్ట్‌.. మోడీకి అంత తేలిక‌కాదు.. ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు.

Tags:    

Similar News