నితీష్ ప్రధాని కుర్చీకే గురిపెట్టారా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇండియా కూటమి తరపున దేశవ్యాప్తంగా తనను తాను పరిచయం చేసుకునేందుకు నితీష్ ప్రయత్నం మొదలుపెట్టారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధానమంత్రి కుర్చీపై గురి పెట్టారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు అలాంటి అనుమానలనే రేకెత్తిస్తోంది. వీలైనన్ని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇండియా కూటమిగా ఏర్పాటవ్వటానికి నితీషే మూలకారకుడన్న విషయం అందరికీ తెలిసిందే.
సంవత్సరాల తరబడి బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నితీష్ గురి సహజంగానే ప్రధానమంత్రి పీఠంపై ఉంటుందనటంలో సందేహం లేదు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇండియా కూటమి తరపున దేశవ్యాప్తంగా తనను తాను పరిచయం చేసుకునేందుకు నితీష్ ప్రయత్నం మొదలుపెట్టారు.
అదేమిటంటే బీహార్లోని ముస్లింలు+ఇతర వర్గాల మద్దతు కోసం యాత్ర. ముస్లిం, మైనారిటీల ఐక్యతకు పిలుపిస్తు నితీష్ ఆగస్టు 1వ తేదీ నుంచి యాత్ర మొదలుపెట్టారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే బీహార్ 38 జిల్లాల్లోని 27 జిల్లాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది.
దీన్ని ఆధారంగా చేసుకునే ముస్లింలు, మైనారిటీల ఐక్యతా యాత్రను ప్రారంభించారు. చరిత్రను కాపాడుకోండి..నితీష్ తో కలిసి రండి..ఇండియా కూటమిని బలోపేతం చేయండనే నినాదంతో యాత్రకు శ్రీకారంచుట్టారు.
పైకి చూడటానికి ఇండియా కూటమిని బలోపేతం చేయటం కోసమే నితీష్ యాత్ర మొదలుపెట్టినట్లుంది. అయితే అంతర్గతంగా మాత్రం దేశవ్యాప్తంగా తన ఇమేజిని పెంచుకోవటమే అసలైన టార్గెట్ అని అర్ధమవుతోంది. ముస్లింలు గనుక ఏకమై ఇండియా కూటమికి సంపూర్ణ మద్దతుగా నిలబడితే ముందు బీజేపీకి తర్వాత ఎన్డీయేకి సమస్యలు తప్పవు. అందుకనే మొదటిమెట్టుగా నితీష్ ముస్లిం, మైనారిటీ వర్గాలను ఏకం చేయటానికి యాత్ర మొదలుపెట్టారు.
ముస్లింలపరంగా చూస్తే బీహార్లో నితీష్ తో ఎప్పుడూ సమస్యలు రాలేదు. కాబట్టి బీహార్లో ముస్లిం, మైనారటీలంతా తన వెంటే ఉండేట్లుగా నితీష్ ప్లాన్ చేసుకుంటున్నారు. నితీష్ కు గనుక ముస్లిం+మైనారిటిల్లో దేశవ్యాప్తంగా మద్దతు పెరిగితే అది ఆటోమేటిగ్గా ఇండియాకూటమిపైన పడుతుంది.
బీహార్ తో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా, కేరళ, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ లో ముస్లింల ప్రాబల్యం గణనీయంగా కనబడుతోంది. అందుకనే నితీష్ చాలా వ్యూహాత్మకంగా పైకి చెప్పకుండానే ప్రధానమంత్రి కుర్చీమీద కన్నేసినట్లు అర్ధమైపోతోంది. మరి తన ప్రయత్నాలు, వ్యూహాలు ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.