ప్రధాని కావాల్సిన నితీష్...చివరికిలా...!

ఆయన జనతా పార్టీ ఆ మీదట జనతాదళ్ వంటి పార్టీల ద్వారా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచారు.

Update: 2024-01-28 19:21 GMT

బీహార్ కి చెందిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి నిజాయతీపరుడు అయిన నేతగా పేరుంది. ఆయనది అయిదు దశాబ్దాల రాజకీయ జీవితం. ఆయన రాం మనోహర్ లోహియా శిష్యుడు. లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ ముఖ్య అనుచరుడు. ఆయన 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన ఎమర్జెన్సీ లో పాలుపంచుకున్నారు.

ఆ తరువాత ఆయన ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన జనతా పార్టీ ఆ మీదట జనతాదళ్ వంటి పార్టీల ద్వారా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచారు. ఇక సమతా పార్టీని ఆయన 1990 దశకంలో పెట్టారు. తదుపరి కాలంలో ఆ పార్టీని జనతాదళ్ లో విలీనం చేసి యూ గా చేసి దానికి నాయకత్వం వహించారు. కేంద్రంలో కీలకమైన రైల్వే శాఖను ఆయన చేపట్టారు.

ఆయన బీజేపీ వరిష్ట నేత అటల్ బిహారీ వాజ్ పేయి కి అత్యంత ఇష్టుడైన నేత. ఆయన్ని తొలిసారి బీహార్ పీఠం మీద కూర్చోబెట్టింది కూడా కూడా అటల్ బిహారీ వాజ్ పేయి. నితీష్ నిజాయతీకి మారు పేరు అని విలువలు కలిగిన నేత అని బీజేపీ వారి కంటే కూడా ఎక్కువగా వాజ్ పేయి ఆయన్ని ప్రేమించారు.

ఇక నితీష్ కుమార్ అదిలో బాగానే ఉన్నా దశాబ్దాల తరబడి బీహార్ సీఎం గా ఉండడంతో ఆ పదవీ వ్యామోహం ఆయన్ని ఆవహించింది అని చెప్పాలి. లేకపోతే ఒకే టెర్మ్ లో రెండు మూడు సార్లు పొత్తులు మార్చి సీఎం గా ప్రమాణాలు చేయడం అంటే అది నితీష్ కే చెల్లు.

ఆయన 2015లో ఆర్జేడీతో పొత్తు పెట్టుకు రెండేళ్ళు వారితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసి 2017లో ఎన్డీయేతో కలిశారు. ఈక్ 2020లో ఎన్డీయేతో పోటీ చేసి సీఎం అయి 2022లో వారితో విభేదాలు తెచ్చుకుని మళ్ళీ ఆర్జేడీతో కలిశారు. ఇపుడు అంటే మళ్ళీ రెండేళ్ళకు అటు నుంచి ఇటు వైపు వస్తున్నారు

ఇలా నితీష్ వేస్తున్న ఈ రాజకీయ జంపింగులు చూసిన వారు ఔరా అని విస్తుబోతున్నారు. నితీష్ లో వంక పెట్టలేని లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఆయన నిబద్ధత కలిగిన నేత. అవినీతిని దరి చేరనీయని నాయకుడు. అంతే కాదు తన వారసులను ఎవరినీ రాజకీయాల్లోకి తీసుకుని రాలేదు. ఇవన్నీ వర్తమాన దేశ రాజకీయాల్లో అవలక్షణాలే.

వీటికి నితీష్ బహు దూరం. ఇక బీహార్ అత్యంత వెనకబడి ఉన్నది. నితీష్ ముఖ్యమంత్రిగా అయ్యాక బాగా అభివృద్ధి చెందింది. ఇవన్నీ ఆయన ఇమేజ్ ని పెంచేవే. మరో వైపు చెప్పాలీ అంటే నితీష్ ప్రధాని స్థాయి అభ్యర్ధి. ఆయన వెనకబడిన వర్గాలకు చెందిన అభ్యుదయ నేత. అలాంటి నేత ప్రధాని పీఠం మీద ఉంటే దేశం మరో మలుపు తిరుగుతుందని అందరికీ ఉంది.

అయితే తన ఇమేజ్ ని ఆయనే కోరి చెడగొట్టుకుంటున్నారు అన్న అపవాదు ఉంది. ఆయన వయసు ఈ ఏడాది మార్చి 1 నాటికి 73 నిండి 74కి చేరువ అవుతోంది. ఇన్నిసార్లు పొత్తులు మార్చిన నితీష్ పదవీకాలం 2025లో ముగియనుంది. అపుడు ఆయన బీజేపీతో వెళ్తారా ఆర్జేడీతో వెళ్తారా అంటే అది ఇపుడు ఆయన కూడా చెప్పలేని పరిస్థితి.

అంతలా నితీష్ తన రాజకీయాన్ని మార్చేసుకున్నారు. మరో వైపు చూస్తే నితీష్ వంటి వారు ఆర్జేడీ నేతలతో వేగలేరు. ఈ సత్యం నితీష్ కి కూడా తెలుసు. ఆర్జేడీ అంటేనే లాలూ వారసుల మయం. కుమారులు రాష్ట్రంలో కీలక పదవులుల్లో ఉంటారు. మీసా భారతి అనే కుమార్తె ఎంపీగా ఉంటారు. అలాగే లాలూ సతీమణి మాజీ సీఎం రబ్రీదేవి పార్టీ మీద పెత్తనం ఎటూ ఉంటుంది.

ఇక ఆరోగ్యం కుదుటపడిన లాలూ కూడా చక్రం తిప్పుతున్నారు. ఒక విధంగా ఆర్జేడీతో పొత్తు అంటే డమ్మీ సీఎంగానే నితీష్ ఉన్నట్లు లెక్క. అలాగే ఆయన రెండేళ్ళ కాపురం చేశారు. ఇది ఆయనకు 2015 నుంచి 2017 దాకా అనుభవంలో ఉన్నదే. అయినా ఆయన ఈసారి ప్రధాని కావాలన్న ఆశతో విపక్ష శిబిరం వైపు దూకారు.

ఆయన దూకే సమయానికి లాలూ కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. విపక్షంలో ఊపు కనిపిస్తోంది. బీజేపీకి దేశవ్యాప్తంగా కూడా ఇమేజ్ తగ్గుతున్న నేపధ్యం ఉంది. ఇపుడు అలా కాదు బీజేపీయే మళ్ళీ గెలుస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. రామ మందిరం ప్రారంభం తరువాత ఉత్తరాదిలో రాజకీయ సన్నివేశం బాగా మారింది.

అదే విధంగా ఇండియా కూటమి సైతం బీటలు వారింది. బీహార్ లో లాలూ ఫ్యామిలీ పెత్తనంతో నితీష్ రోజు రోజుకీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఆయన తిరిగి ఇటు వైపు వచ్చారు అని అంటున్నారు. ఏది ఏమైనా నితీష్ మాత్రం ఇలా చేయడం వల్ల ఆయన ఇమేజ్ మసకబారింది అనే అంటున్నారు.

ఇలా నితీష్ నిర్ణయంతో అనేక మలుపుల తర్వాత బీహార్‌లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ తొమ్మిదవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఒక విధంగా దేశంలో రికార్డుగానే ఉంది. ఇన్నేసి సార్లు ప్రమాణం చేసిన సీఎం వర్తమానంలో ఎవరూ లేరు. అయితే నితీష్ ఈసారితో తన రాజకీయ జీవితానికి అయినా రిటైర్మెంట్ ప్రకటించి రెస్ట్ తీసుకుంటారా లేక మళ్లీ మళ్లీ పొత్తులు మారుస్తూ ఉంటారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News