అయోధ్యకు వస్తానంటున్న నిత్యానంద... తిరిగి పంపిస్తారా?

కాగా... తనను తానుగా దైవాంశసంభూతుడునని చెప్పుకున్న నిత్యానంద ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-01-21 11:31 GMT

నిత్యానంద... ఈ మధ్య అంటే పెద్దగా దర్శనం ఇవ్వడం లేదు కానీ.. ఒకప్పుడు ఈయన నేషనల్ న్యూస్.. ఇండస్ట్రీ టాక్!! ప్రస్తుతం సొంత దేశాన్ని నెలకొల్పుకుని భక్తులకు సుఖసంతోషాలను పంచుతున్నారు! ఈ క్రమంలో తాజాగా ఆన్ లైన్ లో స్పందించిన నిత్యానంద... అయోధ్య వేడుకకు ఆహ్వానం అందిందని వెల్లడించారు. అంతేకాదు... ఈ ఉత్సవానికి తాను హాజరవుతున్నట్లు ప్రకటించుకున్నారు.


అవును... అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు తనకూ ఆహ్వానం అందిందని, ఆ వేడుకకు తాను హాజరవుతున్నట్లు స్వయంగా వెల్లడించారు నిత్యానంద. ఇలాంటి చారిత్రక ఘట్టాన్ని చూసే అవకాశం వస్తే ఎవరూ మిస్ అవ్వద్దు అని సూచిస్తూ.. ఈ ప్రపంచం మొత్తాన్ని ఆశీర్వదించేందుకు రాముడు అయోధ్యలో కొలువుదీరనున్నాడని చెప్పుకొచ్చారు.

కాగా... తనను తానుగా దైవాంశసంభూతుడునని చెప్పుకున్న నిత్యానంద ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలూ ఉన్నాయి. ఇందులో భాగంగా... 2010లో కార్‌ డ్రైవర్‌ ఫిర్యాదుతో నిత్యానందపై విచారణ జరిగడం, అరెస్ట్ కూడా అవ్వడం, అనంతరం బెయిల్‌ పై విడుదలయిన సంగతి తెలిసిందే.

ఆ వివాదాల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోయిన నిత్యానంద... ప్రత్యేకంగా ఖైలస అనే ద్వీపాన్ని కొనుగోలు చేసి, అదే తన దేశమని ప్రచారం చేసుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే ఆ దేశానికి ప్రధాన మంత్రిగా తన ప్రియాతి ప్రియమైన, ప్రత్యేకమైన శిష్యురాలు రంజితను నియమించారు. ఈ దేశానికి సంబంధించిన వెబ్ సైట్ లో వీరిద్దరి ఫోటోలు మాత్రమే ఉండటం గమనార్హం!

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని, తాను హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో... ఇండియాలో ఆయన ల్యాండ్ అయితే.. మూసేయడం గ్యారెంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! మరి ప్రకటించినట్లుగా నిజంగా నిత్యానంద అయోధ్యకు వస్తారా.. వస్తే పోలీసులు రక్షణ కల్పించి, గౌరవ మర్యాదలతో తిరిగి పంపిస్తారా.. లేక మూసేస్తారా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News