రాజకీయాల్లో దిల్ రాజు - నితిన్... పోటీ కన్ ఫాం?
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతోన్న సంగతి తెలిసిందే
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతోన్న సంగతి తెలిసిందే. అధికార బీఆరెస్స్, కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారు తమదైన వ్యూహాలతో సిద్ధమవుతొన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్సాహంమీదున్న కాంగ్రెస్ పార్టీ... చేరికలతో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దిల్ రాజు, నితిన్ ల రాజకీయ రంగప్రవేశాలపై చర్చలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
అవును... నిర్మాత దిల్ రాజు, హీరో నితిన్ లు రాజకీయాల్లోకి రాబోతోన్నారని... నితిన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేయబోతున్నారని, దిల్ రాజుకు బీఆరెస్స్ గాళం వేస్తుందని రకరకాల కథనాలు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు ఇద్దరూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా.. చేస్తే ఏయే నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ సీటు హాట్ హాట్ గా మారుతోన్న సంగతి తెలిసిందే. గతంలో ఎమ్మెల్సీ కవిత ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. గడిచిన ఎన్నికల్లో ఈమెపై పోటీచేసిన బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా బీజేపీ నుంచి అర్విందే పోటీ చేయబోతున్నారని అంటున్నారు.
మరోపక్క ఈసారి కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేయడం లేదని... జి.హెచ్.ఎం.సి. పరిధిలో ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని కథనాలొస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... ఈసారి కాంగ్రెస్ నుంచి సినీ హీరో నితిన్ ను బరిలోకి దింపాలని హస్తం నేతలు చూస్తున్నారని సోషల్ మీడియాలో కాథనాలు వస్తున్నాయి.
అయితే ఈ విషయంలో రేవంత్ టీం కాస్త గట్టిగానే కృషి చేస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా... నితిన్ మేనమామ పీసీసీ కార్యదర్శ నగేశ్ రెడ్డి నిజామాబాద్ రూరల్ టిక్కెట్ ఆశిస్తున్నారని అంటున్నారు. ఐతే ఆ స్థానానికి తీవ్ర పోటీ ఉండటంతో నగేశ్ రెడ్డికి కానీ, ఆయన మేనల్లుడు హీరో నితిన్ ను గాని పార్లమెంట్ కు పోటీ చేయించాలని కాంగ్రెస్ చూస్తోందని అంటున్నారు.
అయితే ఈ స్థానం నుంచి నితిన్ ఫ్యామిలీ నుంచి ఎవరొకరు పోటీ చేయడం మాత్రం కన్ ఫాం అని అంటున్నారు. అయితే నితిన్ ప్రస్తుతానికి సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల.. ఆయన నుంచి పార్టీకి పరోక్ష సహకారం మాత్రమే ఉండొచ్చనే కథనాలు కూడా వస్తున్నాయి. అయితే నితిన్ తండ్రి వైపు కూడా కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నారని మరికొందరు అంటున్నారు.
ఇదే సమయంలో... నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున హీరో నితిన్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ పోటీచేస్తే... వారికి ధీటుగా దిల్ రాజుని నిలబెట్టాలని బీఆరెస్స్ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ బీఆరెస్స్ ఎంపీ అభ్యర్థిగా దిల్ రాజు ని ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారంట.
అయితే తాను ఏ పార్టీ నుంచైనా, ఎక్కడి నుంచైనా పోటీ చేయగలనని.. ఎంపీగా కచ్చితంగా గెలవగలనంటూ ఇటీవల దిల్ రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో బీఆరెస్స్ పెద్దలు... నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థిగా దిల్ రాజువైపు చూస్తున్నారని అంటున్నారు. దీంతో ఈసారి నిజామాబాద్ ఎంపీ స్థానం హాట్ టాపిక్ గా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అయితే నిర్మాత దిల్ రాజు, హీరో నితిన్ లు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.. రాజకీయాల్లో తలపడతారా.. లేదా సినిమాల్లోనే నిలబడతారా అన్నది వేచి చూడాలి.
కాగా... "జయం" సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నితిన్.. తన రెండో సినిమా "దిల్"తో నిర్మాతగా దిల్ రాజుతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.