భారత్ పై కడుపులో ద్వేషం.. పైకి సందేశం.. ఇదీ బంగ్లా సారథి నిజ స్వరూపం!
తాజాగా యూనస్ అసలు స్వరూపం బయటపడింది. మోమునుల్ హక్.. బంగ్లాదేశ్ కు చెందిన అతివాద సంస్థ హెఫాజత్-ఎ-ఇస్లాం నాయకుడు.
ఆయనో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి గ్రహీత. వయసు 84 ఏళ్లు.. సరే.. ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారు అందరికీ సంతోషం. ఇలాంటి సమయంలో అనూహ్యంగా దేశాన్ని పాలించే అవకాశం దక్కింది. మంచికో చెడుకో దీనిని సద్వినియోగం చేసుకుంటూ.. పెద్దన్నలాంటి పొరుగు దేశంతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటే పరస్పరం బాగుంటుంది. కానీ, ఆయన అలాంటివాడు కాదు. నిలువెల్లా ద్వేషం నింపుకొన్న వాడు. అందుకనే తనలాంటి వారిని చేరదీస్తున్నాడు. ఇదంతా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద యూనస్ గురించి.
ఇదిగో ఇదే సాక్ష్యం సరిగ్గా నెల కిందట కూడా మొహమ్మద్ యూనస్ జీవించి ఉన్నట్లు ఎవరికీ తెలియదు. అనూహ్యంగా బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడంతో ఫ్రాన్స్ లో ఉన్న యూనస్ ను పిలిచి మరీ ప్రభుత్వ అధినేతను చేశారు. అయితే, ఈ అవకాశం దక్కే సమయంలోనే ఆయన భారత్ పై తీవ్ర విమర్శలు చేశారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందంటూ లేనిపోని ఆరోపణలకు దిగారు. ఇక ప్రభుత్వ అధినేత అయ్యాక కూడా ఈ ధోరణి మారలేదు. భారత్ తో ఎప్పుడు ఘర్షణకు దిగుదామా? అని ఆలోచిస్తున్నట్లుంది. భారత్ లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని తరచూ డిమాండ్లు చేస్తున్నారు.
తాజాగా యూనస్ అసలు స్వరూపం బయటపడింది. మోమునుల్ హక్.. బంగ్లాదేశ్ కు చెందిన అతివాద సంస్థ హెఫాజత్-ఎ-ఇస్లాం నాయకుడు. భారత్ పై విషం కక్కే ఇతడితో యూనుస్ సమావేశం అయ్యారు. రెచ్చగొట్టేలా ప్రసంగిస్తూ భారత్ ను ద్వేషించే మోమునుల్ తో ఏకంగా యూనస్ ఏకంగా బంగ్లాదేశ్ లో ఎన్నికల గురించి చర్చించడం గమనార్హం.
జైలు నుంచి బయటకు తెచ్చి.. మోమునుల్ హక్.. హింస సహా అతివాద చేష్టలతో అతడిని షేక్ హసీనా సర్కారు జైలులో వేసింది. అయితే, హసీనా దిగిపోయాక వచ్చిన యూనస్ ప్రభుత్వం మోమునుల్ ను విడుదల చేసింది. ఇప్పుడు అతడితో మరికొందరు భారత వ్యతిరేకులతోనూ యూనుస్ భేటీ అయ్యారు. దేశంలో ఎన్నికల సంస్కరణలు, తాజాగా ఎన్నికల నిర్వహణను చర్చించారని సమాచారం.
ఇకపోతే.. బంగ్లాదేశ్ లో మూడో పెద్ద పార్టీ జమాతే ఇస్లామీ. పూర్తి మతతత్వ పార్టీ. దీనినీ హసీనా సర్కారు బ్యాన్ చేసింది. యూనస్ సర్కారు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. దీన్నిబట్టే భారత్ పై యూనస్ వైఖరి ఏమిటో తెలిసిపోతోంది. పైకి మాత్రం జమాతే ఇస్లామీ అధినేత షఫీకుర్ రహమాన్ భారత్ తో స్నేహం కోరుకుంటున్నామని చెప్పాడు. అతలోనే సంబంధాల పేరిట తమ దేశ అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్ ను హెచ్చరించాడు. దీంతోపాటు హసీనాను ఎప్పుడు అప్పగిస్తున్నారో చెప్పాలంటూ ఇప్పటికే భారత్ ను బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది.