చంద్రబాబు ఊసు లేకుండా తెలంగాణ ఎన్నికలు.. నిజమెంత?

ఈసారి జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రస్తావన పెద్దగా లేకుండా ఎన్నికలు ఒక ప్రత్యేకతగా చెప్పాలి.

Update: 2023-11-26 05:38 GMT

తెలంగాణ ఏర్పడటం తర్వాత.. ఏర్పడటానికి ముందు కూడా ప్రతి సందర్భంలోనూ ప్రస్తావనకు వచ్చే చంద్రబాబు ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఆయన ప్రస్తావనే లేని పరిస్థితి. ఈసారి జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రస్తావన పెద్దగా లేకుండా ఎన్నికలు ఒక ప్రత్యేకతగా చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. చంద్రబాబు ఫ్యాక్టర్ బయటకు కనిపించక పోవచ్చు. లేదంటే.. రాజకీయ అధినేత ప్రసంగాల్లో చంద్రబాబు ఊసు లేకపోవచ్చు కానీ.. ఎన్నికల్లో మాత్రం ఆయన ప్రభావం ఉంటుందని మాత్రం చెబుతున్నారు.

గతంలో తెలంగాణ ఎన్నికలు జరిగిన రెండు సందర్భాల్లోనూ చంద్రబాబును బూచిగా చూపించటం.. ఆంధ్రా సెంటిమెంట్ ను రాజేయటం తెలిసిందే. ఏపీ సెంటిమెంట్ కు కాస్తంత దూరంగా జరుగుతున్న తొలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలుగా చెప్పాలి. గత రెండు ఎన్నికల్లోనూ ఆంధ్రా బూచితో తెలంగాణ ఓటర్లు ప్రభావితం అయ్యారని చెప్పక తప్పదు. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆంధ్రా అన్న ప్రస్తావన పెద్దగా లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి.

ఎన్నికల ప్రచారంలోనూ.. అధినేత ఎన్నికల ప్రసంగాల్లోనూ.. బహిరంగ సభల్లోనూ చంద్రబాబు ప్రస్తావన లేకపోవచ్చు. కానీ.. అంతర్గతంగా మాత్రం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో చంద్రబాబు ఫ్యాక్టర్ తుది ఫలితం మీద ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు.

గడిచిన రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యక్షంగా ఎన్నికల ఎజెండాగా లేకపోవచ్చు. కానీ.. పరోక్షంగా ఉన్నారన్నది మర్చిపోకూడదు. చంద్రబాబు లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయని అనుకోవటం సరికాదని.. చంద్రబాబు ఫ్యాక్టర్ పరోక్షంగా ఎన్నికల్ని ప్రభావితం చేస్తుందంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చంద్రబాబు ఉన్నారు.

Tags:    

Similar News