దేశ రాజధానిలో భూకంపం!
నేపాల్ లో రెండోసారి చోటుచేసుకున్న భూకంపం తర్వాత దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.
ఉత్తర భారతదేశం తీవ్ర భూకంపనల దాటికి వణికింది. ముందు భారత్ పొరుగు దేశం.. నేపాల్ లో గంట వ్యవధిలో వరుసగా నాలుగు భూకంపాలు వచ్చాయి. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో భూప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర భూ ప్రకంపనలు వచ్చాయి.
భారత కాలమానం ప్రకారం.. అక్టోబర్ 3న మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ– దేశ రాజ«ధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు పెట్టారు. కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు చోట్ల ఈ ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ లోని లక్నో, హాపుర్, అమ్రోహా, ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
ముందుగా భారత్ పొరుగు దేశం.. నేపాల్‌లో మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో తొలిసారి భూకంపం సంభవించింది. తొలుత అది 4.6 తీవ్రతతో నమోదైంది. పది కిలోమీటర్లు లోతులో అది కేంద్రీకృతమై ఉన్నట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం పేర్కొంది.
ఇది జరిగిన అర గంటలోపే మధ్యాహ్నం 2.51 గంటలకు అంతకంటే ఎక్కువగా 6.2 తీవ్రతతో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఇది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3.06, 3.19 గంటలకు మరో రెండుసార్లు స్వల్ప తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది.
నేపాల్ లో రెండోసారి చోటుచేసుకున్న భూకంపం తర్వాత దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లు, ఆఫీసుల్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు కదిలిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై బయటకు పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక అధికారులు, ఢిల్లీ పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేశారు. కంగారు పడకుండా మైదాన ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
కాగా ఢిల్లీకి సమీప ప్రాంతం నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, బరేలీలో కూడా భూమి కంపించింది.