రాజధాని రైతులకు మరో షాక్.. ప్లాట్లను రద్దు చేసుకోవాలంటూ నోటీసులు?

ఏపీ రాజధాని అమరావతి రైతులకు మరో షాకింగ్ పరిణామం ఎదురైంది.

Update: 2023-10-29 04:15 GMT

ఏపీ రాజధాని అమరావతి రైతులకు మరో షాకింగ్ పరిణామం ఎదురైంది. ఇప్పటికే అమరావతి స్థానే మూడు రాజధానుల కాన్సెప్టు రావటం.. రాజధాని కోసం వేలాది ఎకరాల భూముల్ని గత ప్రభుత్వానికి అందజేయటం.. అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు కేటాయించిన నేపథ్యంలో.. తాజాగా రాజధాని రైతులు తమకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసుకోవాలని కోరుతూ నోటీసులు పంపుతున్న వైనం కొత్త ఆందోళనకు కారణమవుతోంది. అమరావతి ఉనికి ప్రశ్నార్థకంగా చేసేందుకు జరుగుతున్న చర్యగా దీన్ని భావిస్తున్నారు.

అమరావతి ప్రకటన నేపథ్యంలో కొందరు రైతులు తమకు తామే.. స్వచ్ఛందంగా భూములు ఇవ్వటం తెలిసిందే. మరికొందరు మాత్రం తమ భూముల్ని ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించేందుకు వీలుగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అందుకు ప్రతిగా సదరు రైతులకు నిర్ణయించిన ధర ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ భూముల్లో అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ప్రక్రియ ఇలా సాగుతున్న సమయంలోనే ఎన్నికల రావటం.. ప్రభుత్వం మారటం.. ప్రాధామ్యాలు మారటం తెలిసిందే. రిజిస్ట్రేషన్ కాని స్థలాల్ని ఉపయోగించుకోవటానికి.. అమ్ముకోవటానికి లేకుండా పోవటంతో వాటిని మార్చి ఇవ్వాలని అమరావతి రైతులు పలువురు కోరుతున్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఈ అంశంపై స్పందించని అధికారులు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసుకోవాలని.. వారికి వేరే చోట ప్లాట్లు కేటాయిస్తామని పేర్కొంటూ సీఆర్డీఏ నోటీసులు పంపిన వైనం కొత్త కలకలానికి కారణమవుతోంది.

భూములు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసుకుంటే.. రాజధాని కోసం భూములు ఇవ్వని వారికి లబ్థి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరకు వచ్చిన వేళలో వచ్చిన నోటీసుల విషయంలో తొందరపాటు వద్దన్న సూచన వినిపిస్తోంది. సీఆర్డీఏ నుంచి వచ్చే లేఖలకు ప్రతిగా తొందరపడి సంతకాలు చేస్తే.. భూములు ఇవ్వటానికి ఒప్పుకోని రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తే.. అమరావతి ఉనికి ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రాజధాని రైతులకు అందుతున్న ఈ నోటీసులు హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News