మరోసారి సీనియర్‌ దళిత నేత అలకపాన్పు!

ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్లు ప్రకటించినప్పుడు తనకు ఆలేరు నుంచి సీటు కేటాయిస్తారని మోత్కుపల్లి ఆశించారు.

Update: 2023-08-24 10:44 GMT

తెలంగాణ రాజకీయాల్లో మోత్కుపల్లి నర్సింహులు తెలియనివారు లేరు. గతంలో పలుమార్లు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఆయన సేవలను కేసీఆర్‌ వినియోగించుకుంది లేదు.. అలాగే ఏ పదవినీ ఆయనకు ఇవ్వలేదు. తాజాగా కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల లిస్టులోనూ మోత్కుపల్లి నర్సింహులు పేరు లేదు.

దీంతో మోత్కుపల్లి తన రాజకీయ భవిష్యత్తుపై దృష్టి సారించారు. 1983, 1985, 1989, 1994, 1999ల్లో వరుసగా ఐదుసార్లు ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నుంచి ఆయన గెలుపొందారు. 1983 నుంచి 1994 వరకు నాలుగుసార్లు టీడీపీ నుంచి విజయం సాధించిన మోత్కుపల్లి 1999లో ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలోకి వచ్చిన ఆయన 2009లో తుంగతుర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2018లో ఆలేరు నుంచి బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ తరఫున పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచారు. మొత్తం మీద ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మరోవైపు రాష్ట్రం విడిపోయినా మోత్కుపల్లి నర్సింహులు టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు రాజ్యసభ సీటు లేదా ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌ పదవి ఇప్పిస్తానని చెప్పారని అప్పట్లో మోత్కుపల్లి చెప్పారు. అయితే ఆయనకు ఏ పదవి దక్కలేదు. దీంతో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసి 2018లో కేసీఆర్‌ హామీతో బీఆర్‌ఎస్‌ లోకి వచ్చారు.

కేసీఆర్‌.. దళితబంధు పథకం ప్రవేశపెట్టిన సమయంలో మోత్కుపల్లి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆయనను పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్లు ప్రకటించినప్పుడు తనకు ఆలేరు నుంచి సీటు కేటాయిస్తారని మోత్కుపల్లి ఆశించారు. అయితే కేసీఆర్‌ ఆయనకు మొండిచేయి చూపారు.

మరోవైపు ఆరు నెలలుగా కేసీఆర్‌ అపాయింట్‌ మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నా ఆయన ఇవ్వలేదని మోత్కుపల్లి అవమానంగా భావిస్తున్నారని సమాచారం. కనీసం తనకు టికెట్ల ప్రకటన గురించి మాట మాత్రంగా కూడా చెప్పలేదని ఆవేదన చెందుతున్నట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు.. కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్‌ఎస్‌ తొలి జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఆలేరు నుంచి సీటు దక్కకపోవడంతో భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో యాదగిరిగుట్టలో తన అనుచరులతో సమావేశం అయ్యారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేస్తారని కాంగ్రెస్‌ లేదా బీజేపీల్లో ఏదో ఒక పార్టీలో చేరతారని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News