గన్నవరం ఎయిర్ పోర్టు సీన్.. వైసీపీలో కొత్త చర్చ!

అయితే.. ఇలాంటి తీరుతో వచ్చే చిక్కేమంటే.. ఒకసారి ఓకే.. పదే పదే అలాంటివి చోటు చేసుకోనప్పుడు పోలిక మొదలవుతుంది.

Update: 2024-07-09 05:15 GMT

ఎంతలో ఎంత తేడా? వైసీపీలో ఇప్పుడు ఇదో చర్చగా మారింది. వారం వ్యవధిలో తమ అధినేత ఇమేజ్ విషయంలో ఇంత తేడానా? అన్న మాట ఇప్పుడు పలువురి నోటి వెంట వినిపిస్తోంది. ఎన్నికల్లో దారుణ పరాజయం వేళ.. కాస్త మార్పు కోసం తన సొంత నియోజకవర్గంతో పాటు.. బెంగళూరు శివారులోని తన ప్యాలెస్ లో కొంతకాలం ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కాస్త గ్యాప్ తర్వాత తాడేపల్లికి రావటం తెలిసిందే. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తమ బాస్ కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నేతలు.. అభిమానులు రావటంతో పాటు.. ‘సీఎం.. సీఎం’ అంటూ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాలు దద్దరిల్లేలా నినాదాలు చేశారు.

ఇదంతా చూసిన కొందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. దారుణ పరాజయం తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చిన తమ అధినేతకు ఇంత భారీ స్వాగతమా? అంటూ ఆశ్చర్యపోయినోళ్లు ఉన్నారు. సాధారణంగా దారుణ పరాజయం తర్వాత ఘన స్వాగతాలు లాంటివి పెద్దగా కనిపించవు. అందుకు భిన్నంగా జగన్ విషయంలో చోటు చేసుకున్న తీరును చూసినోళ్లు.. అదెలా సాధ్యమన్న విషయాన్ని క్రాస్ చెక్ చేయగా.. నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసిన వైనం బయటకు వచ్చింది. జగన్ సన్నిహితుల నుంచి వచ్చిన ప్రత్యేక సూచనతో ఈ తరహా ఏర్పాట్లు చేసిన విషయం వెల్లడి కావటంతో నోరెళ్ల బెట్టాల్సి వచ్చింది.

అయితే.. ఇలాంటి తీరుతో వచ్చే చిక్కేమంటే.. ఒకసారి ఓకే.. పదే పదే అలాంటివి చోటు చేసుకోనప్పుడు పోలిక మొదలవుతుంది. దాని వల్ల తొలత వచ్చిన మైలేజీకి మించిన డ్యామేజ్ ఎదురవుతుంది. ఈ విషయాన్ని జగన్ అండ్ కో మిస్ అయినట్లుగా ఉంది. తన తండ్రి వైఎస్ 75వ జయంతిని పూర్తి చేసుకొని గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్ కు స్వాగతం పలికేందుకు పెద్దగా నేతలు రాకపోవటంతో వారంలోనే ఇంతలా గ్రాఫ్ పడిపోయిందా? అన్న చర్చ మొదలైంది.

పేటీఎం బ్యాచ్ తో ఇలాంటి ఇబ్బందే ఉంటుందని.. అందుకే ఓటమి వేళ వీలైనంతవరకు లో ప్రొఫైల్ లో ఉండటం మంచిదన్న విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు. మరో ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండటం.. ఎన్నికల్లో గెలిచిన 11 సీట్ల దారుణ పరాజయం కొన్నేళ్ల పాటు వెంటాడటం ఖాయం. అలాంటప్పుడు పోయిన పరపతిని తిరిగి తెచ్చుకునే విషయంలో పేటీఎం బ్యాచ్ లాంటి వారిని దింపి షార్టు కట్ లో ఇమేజ్ ను అమాంతం పెంచాలనుకుంటే తిప్పలు తప్పవు. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ విషయంలో జగన్ సన్నిహితులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News