డబ్బులే డబ్బులు.. విదేశాల నుంచి పంపుతున్న ఎన్ఆర్ఐలు!

ఇదే సమయంలో రూపాయి మారకం విలువ బాగా తగ్గిపోవడంతో వారి సంపదకు విలువ పెరుగుతోంది.

Update: 2025-01-05 15:41 GMT

మనోళ్లు విదేశాల్లో మస్తు సంపాదిస్తున్నారు. ఒక ఏడాదిలో రూ.14 లక్షల కోట్లను మన దేశానికి పంపారు. విదేశీ బ్యాంకులతో పోల్చితే మన బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుండటంతో ఎన్ఆర్ఐల పెట్టుబడులు ఇటీవల ఎక్కువగా పెరిగాయి. ఇదే సమయంలో రూపాయి మారకం విలువ బాగా తగ్గిపోవడంతో వారి సంపదకు విలువ పెరుగుతోంది. దీంతో ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు స్వదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకోడానికి ప్రాధాన్యమిస్తున్నారు.

ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం గత ఏడాది అక్టోబర్ నాటికి ఎన్ఆర్ఐల డిపాజిట్లు 13.4 శాతం పెరిగాయి. పదేళ్లో గరిష్ఠ స్థాయికి చేరాయి. 2023 నవంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్య ఏడాది సమయంలో ఎన్ఆర్ఐలు సుమారు 16,270 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బు మన రూపాయిల్లో సుమారు 13 లక్షల 83 వేల కోట్లకు సమానం. గత తొమ్మిదేళ్లలో ఇదే అత్యధిక వార్షిక వృద్ధి రేటుగా చెబుతున్నారు. అంతర్జాతీయంగా మిగతా బ్యాంకులతో పోల్చితే మన దేశంలోని బ్యాంకులు అధిక వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎన్ఆర్ఐలు స్వదేశంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

ప్రవాసీల డిపాజిట్లతో మన బ్యాంకులు భారీగా ఉపశమనం పొందుతున్నాయి. ప్రస్తుతం దేశంలో రుణ డిమాండ్కు తగ్గట్టు బ్యాంకుల్లో నగదు నిల్వ లేదు. దీంతో బ్యాంకులు డిపాజిట్ల కోసం అన్వేషిస్తున్నాయి. ఇలా డిపాజిట్ల వేటలో ఉన్న బ్యాంకులకు ప్రవాసీల డిపాజిట్లు ఉపయోగపడుతున్నాయి. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ బాగా తగ్గిపోవడంతో ప్రవాసులు దేశీయ బ్యాంకుల్లో దాచుకోడానికి మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా దేశంలోని వారి బంధువుల అకౌంట్లకు పంపుతున్నారు. ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ప్రకారం.. గత ఏడాది ఎన్‌ఆర్‌ఐలు రెమిటెన్స్‌ల రూపంలో 12 వేల 900 కోట్ల డాలర్లు అంటే రూ.10 లక్షల 96 వేల కోట్లు మనదేశానికి పంపారు. గత ఏడాది అత్యధిక రెమిటెన్స్ పొందిన దేశాల్లో మనదే అగ్రస్థానంలో ఉన్నాం. ఈ ఏడాది కూడా ఆ రికార్డు పదిలంగానే ఉంది.

Tags:    

Similar News