'తమ్ముళ్లు' కసి తీర్చేసుకున్నారు!
ఏపీలో టీడీపీ సాధించిన అప్రతిహత విజయం ఆ పార్టీ శ్రేణుల్లో ఎనలేని జోష్ నింపింది. ఎక్కడికక్కడ తమ్ముళ్లు సంబరాలు చేసు కున్నారు
ఏపీలో టీడీపీ సాధించిన అప్రతిహత విజయం ఆ పార్టీ శ్రేణుల్లో ఎనలేని జోష్ నింపింది. ఎక్కడికక్కడ తమ్ముళ్లు సంబరాలు చేసు కున్నారు. కేకులు కట్ చేసుకున్నారు.. టపాసులు పేల్చారు.. బాణసంచా కాల్చారు..గులాములు రాసుకున్నారు. ఓరే్ంజ్‌లో రెచ్చిపోయారు. ఆనందాన్ని ఆనందంగా పంచుకున్నారు. అయితే.. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా తమ్ముళ్లు నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో వారు రెచ్చిపోయారు. ముఖ్యంగా విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును మార్చడంపై ఆగ్రంతో ఉన్న యువత తమ కసి తీర్చేసుకున్నారు.
2023లో వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చేసింది. వైద్య రంగంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక ప్రయోగాలు చేశారని.. రూపాయి డాక్టర్‌గా సేవలు అందించారని పేర్కొంది. అంతేకాదు.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆరోగ్య శ్రీవంటి కార్యక్రమాన్ని తీసుకువచ్చిపేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేశారని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ ఆర్ పేరు పెట్టడం సముచితమని తాము భావిస్తున్నట్టు అసెంబ్లీనే సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రాత్రికి రాత్రి యూనివర్సిటీ పేరును మార్చేశారు.
అయితే.. ఇలా పేరు మార్చడంపై అప్పట్లోనే టీడీపీ నాయకుల నుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబం కూడా.. ఇలా చేయడం సరికాదని పేర్కొంది. అయినా కూడా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక, ఇప్పుడు టీడీపీ భారీ ఆధిక్యతతో విజయం దక్కించుకోవడంతో ఆపార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ అక్షరాలను పగుల గొట్టారు. అంతేకాదు.. జై ఎన్టీఆర్.. జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం.. పేరును మార్చేశారు. అయితే.. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. తీసుకున్న నిర్ణయం దరిమిలానే ఈ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం జరిగింది అభిమానంతో కూడిన ఆవేశ కార్యక్రమమే.