భారత్ కొంప ముంచే పని చేయనున్న పొరుగు దేశం?
ఇటీవల కాలంలో ఏ దేశమూ చేయని ప్రయోగం అణు పరీక్ష. 1998లో భారత్, ఆ వెంటనే పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించాయి
ఇటీవల కాలంలో ఏ దేశమూ చేయని ప్రయోగం అణు పరీక్ష. 1998లో భారత్, ఆ వెంటనే పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించాయి. ఆ తర్వాత ఇరాన్, ఉత్తర కొరియా తరచూ ఇలాంటివి చేస్తుంటాయనే కథనాలు వచ్చినా నిర్ధారణ కాలేదు. అయితే, ఓ దేశం మాత్రం త్వరలో అణు పరీక్షలకు దిగనుందనే కథనాలు వస్తున్నాయి. అది కూడా మామూలు దేశం కాదు. ప్రపంచంలో జనాభాలో టాప్. ఆర్థిక వ్యవస్థలో టాప్ 3. ఇంకా చెప్పాలంటే సూపర్ పవర్ పొజిషన్ కు చాలా దగ్గరగా ఉంది. ఇక ఆ దేశం తీరే వేరు. చిన్న విషయానికీ కయ్యానికి కాలుదువ్వుతుంది.. తమ ప్రయోజనాలే తప్ప ఇతర విషయాలు ఏవీ పట్టించుకోదు.. పొరుగు దేశాల భూభాగాలపై కన్నేస్తుంది.. అవసరమైతే సరిహద్దులను మార్చేస్తుంది.. ఇతర దేశాల భూభాగాలతో మ్యాప్ లు విడుదల చేస్తుంది.. అందులోని ప్రదేశాలకు పేర్లు పెడుతుంది. ఎక్కడో దూరంగా ఉన్న దేశాలకు ఆర్థిక సాయం చేసి వాటిని రుణ బంధంలో ఇరికించి ప్రయోజనం పొందుతుంది. ఇప్పుడలాంటి దేశం మరో బాంబు పేల్చేందుకు సిద్ధమవుతోంది.
60 ఏళ్ల కిందట ఎక్కడైతే..
కమ్యూనిస్టు చైనా మరోమారు అణు పరీక్షకు సిద్ధమవుతోందనే కథనాలు వస్తున్నయి. అరవయ్యేళ్ల క్రితం పరీక్షలు జరిగిన ప్రాంతంలోనే జోరుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పశ్చిమ దేశాల నిఘావర్గాలు గమనించాయి. జిన్‌జియాన్ రీజియన్‌లోని లాప్ నుర్ న్యూక్లియర్ పరీక్ష కేంద్రాన్ని మళ్లీ క్రియాశీలం (రీయాక్టివేషన్) చేస్తున్నదని తెలుస్తోంది. ఈ విషయాన్ని మక్సర్ శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ ఇదే సంస్థ శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. మరోవైప అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ చైనా అణు పరీక్షలకు సిద్ధం అవుతున్నదంటూ సంచలన కథనం ప్రచురించడం పెద్దఎత్తున చర్చకు తావిస్తోంది.
అప్ గ్రేడా? లేక ..?
జిన్ జియాన్ లోని అణు పరీక్ష కేంద్రాన్ని చైనా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నది. ఆరేళ్ల కిందట ఈ ప్రదేశంలో కొన్ని భవనాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడది ఆధునికీకరణ అయింది. అణు పరీక్షకు సిద్ధమవుతున్న సంకేతాలతో ఫెన్సింగ్ తో కూడిన అత్యాధునిక కాంప్లెక్స్‌లు వచ్చాయి. భారీ స్థాయి పేలుళ్లను నిర్వహించేలా బంకర్, కొత్త ఎయిర్ బేస్ నిర్మాణాల్లో ఉన్నాయి. 90 అడుగుల పొడవైన పెద్ద డ్రిల్లింగ్ మెషీన్ కూడా ఉండడం గమనార్హం. అయితే, పూర్తిస్థాయిలో అణు పరీక్షలు లేదా సబ్ క్రిటికల్ అణు పేలుళ్లను నిర్వహించేలా కనిపిస్తున్నదని ఇంగ్లిష్ మీడియా పేర్కొంటోంది. కొత్త తరం బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో వినియోగించే కొత్త నూక్లియర్ వార్ హెడ్‌లను పరీక్షించేందుకు, వాటి సామర్థ్యాన్ని పరిశీలించేందుకు చైనా ఆసక్తి కనబరుస్తున్నట్టు స్పష్టవుతోంది. 2013లో చైనా వద్ద 50 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉండగా.. 2028 నాటికి ఆ సంఖ్యను వెయ్యికి పైగా పెంచాలని చూస్తోంది. మరోవైపు వుయ్ గర్ ముస్లింలు అధికంగా ఉండే జిన్ జియాంగ్ ప్రాంతంలోనే చైనా అణు పరీక్షలు చేపడుతోంది. ఈ జాతి వారిని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంలో ఉందని చైనాపై ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
భారత్ బహు పరాక్..
భారత్ 25 ఏళ్ల కిందట రెండోసారి అణుపరీక్షలు చేసి.. అనంతరం స్వచ్ఛందంగా నిషేధం విధించుకుంది. అణ్వాయుధాల ఆధునికీకరణకు కొత్తగా పరీక్షలు చేయకుండా కంప్యూటర్ సిమ్యులేషన్ మీద ఆధారపడుతోంది. ఇప్పుడు చైనా ఏకంగా పరీక్షలకు సిద్ధమవుతోందనే కథనాలను కాస్త తీవ్రంగా తీసుకోవాల్సిందే. ఇక పాతికేళ్ల కిందటితో పోలిస్తే చైనా మరింత బలోపేతం అయింది. సూపర్ పవర్ స్థానానికి అమెరికాతో పోటీ పడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశం చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే.