ఈ రోజు తెలంగాణ ఫలితాల రోజు..కేసీఆర్ మౌనంగా నిష్క్రమించిన రోజు
సరిగ్గా ఏడాది కిందట.. ఇదే రోజు.. డిసెంబరు 3.. తెలంగాణ చరిత్రలో కీలక రోజు. దాదాపు పదేళ్లు సాగిన పాలన ముగిసిన రోజు..
సరిగ్గా ఏడాది కిందట.. ఇదే రోజు.. డిసెంబరు 3.. తెలంగాణ చరిత్రలో కీలక రోజు. దాదాపు పదేళ్లు సాగిన పాలన ముగిసిన రోజు.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న పార్టీకి పట్టం కట్టిన రోజు. కొత్త నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పునాది పడిన రోజు.
అసలు ఓడిపోతుందా అనుకుంటే?
దశాబ్దాల కల నెరవేరుతూ 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా.. తెలంగాణలో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చింది. ఆపై 2018లో ముందస్తు ఎన్నికల్లో మళ్లీ గెలిచింది. ఇక 2023లో ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ గా మారింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీ ఆర్థికంగా, సంస్థాగతంగా బాగా బలపడింది. ఇలాంటి సమయంలో అసలు బీఆర్ఎస్ కు ఓటమి ఉంటుందా? అనే బలమైన అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ, 2023 నవంబరు 30న జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయం తప్పలేదు.
పదేళ్ల అధికార వియోగం అనంతరం
ఎంతో వ్యతిరేకత వ్యక్తం అయినా.. ప్రత్యేక రాష్ట్రం సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం దక్కేందుకు పదేళ్లు పట్టింది. పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో సాధ్యం కానిది రేవంత్ రెడ్డి హయాంలో సాధ్యమైంది. నిరుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో ఎలాంటి సంకోచం లేకుండా ఆయన సీఎం అయ్యారు.
కేసీఆర్ మౌన నిష్క్రమణ
నిరుడు నవంబరు 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరగ్గా డిసెంబరు 3న ఫలితాలు వెలువడ్డాయి. కాగా, అప్పటిదాక పదేళ్లు తెలంగాణను శాసించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంల నివాసంగా ఉన్న ప్రజా భవన్ ను మార్చేసి ప్రగతి భవన్ పేరిట కొత్త కార్యాలయం నిర్మింపజేశారు. అందులోకి సాధారణంగా ఎవరికీ ప్రవేశం ఉండదనే విమర్శలు వచ్చినా కేసీఆర్ లెక్క చేయలేదు. చివరకు 2023 ఎన్నికల్లో ఓటమి అనంతరం అదే ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ సాదాసీదాగా నిష్క్రమించారు.
అప్పటివరకు సీఎంగా ఉన్న భారీ కాన్వాయ్ ను కాదని.. కేవలం ఒకటి రెండు వాహనాల్లో ఆయన తన ఫాంహౌస్ కు వెళ్లిపోయారు. సీఎం పదవికి తన రాజీనామాను గవర్నర్ కు నేరుగా సమర్పించలేదు కూడా.
..ఇదీ నిరుడు డిసెంబరు 3న జరిగిన పరిణామం.