వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. 'ప్రత్యేక' సమావేశాల ఎజెండా ఇదేనా?

వరుస పెట్టి కీలక నిర్ణయాలు తీసుకునేస్తున్న మోడీ సర్కారు.. మరో భారీ నిర్ణయాన్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యిందా?

Update: 2023-09-01 04:48 GMT

వరుస పెట్టి కీలక నిర్ణయాలు తీసుకునేస్తున్న మోడీ సర్కారు.. మరో భారీ నిర్ణయాన్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యిందా? తమకున్న సానుకూలతలను పరిగణలోకి తీసుకొని తమ మార్క్ వేయాలని తపిస్తున్న మోడీ.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అనూహ్య రీతిలో గురువారం మోడీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబరులో పార్లమెంట్ అమ్రత్ కాల్ స్పెషల్ సెషన్ ను ప్రకటించింది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్ని నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎందుకిలా? ఏ ఎజెండాతో ఈ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి? అన్న విషయంలోకి వెళితే.. లోక్ సభకు ముందస్తుకు వెళ్లేందుకు వీలుగా కసరత్తు జరుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు వన్ నేషన్ సిరీస్ లో బోలెడన్ని మార్పులు తెచ్చిన మోడీ సర్కారు.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ను కూడా నిర్వహించాలని భావిస్తున్నారా? అన్నది చర్చగా మారింది. ప్రత్యేక సెషన్ లో జమిలి ఎన్నికల బిల్లు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఒక దేశం.. ఒక ఎన్నిక బిల్లు పెట్టటం ద్వారా ఇప్పటివరకు సాగుతున్న ఎన్నికల విధానాన్ని మార్చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన వేళ.. అనూహ్యంగా మళ్లీ ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను నిర్వహించటం వెనుక ఉద్దేశంపై కొత్త చర్చ జరుగుతోంది.

జమిలి ఎన్నికలకు అనుకూలంగా బిల్లును తీసుకొచ్చిన పక్షంలో.. దానికి మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం అవుతుంది. లోక్ సభలో ఈ బిల్లుకు ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ.. రాజ్యసభలో మాత్రం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనటం ఖాయం. అక్కడ ఏదైనా తేడా జరిగితే.. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లిపోవాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే.. ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పాలి. గ్యాస్ బండ మీద ఒక్కసారి రూ.200 చొప్పున తగ్గించటం.. రానున్న రోజుల్లో పెట్రోల్.. డీజిల్ మీద కూడా లీటరుకు రూ.5 వరకు ఒక్కసారిగా ధరలు తగ్గించేస్తూ ప్రకటన రావొచ్చన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇవన్నీ కూడా ముందస్తుకు సంకేతాలుగా చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే మేలో జరగాల్సిన లోక్ సభ ఎన్నికలు.. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం డిసెంబరులో జరిగే వీలుంది. మరో మూడు వారాలు ఆగితే.. జమిలిపై మరింత క్లారిటీ వస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News